దేశ రాజధానిలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 27 మంది సజీవ దహనమయ్యారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో సాయంత్రం 4.40 సమయంలో మంటలు చెలరేగాయి. కనీసం 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించామని పేర్కొన్నారు.
ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఘటన గురించి తెలియగానే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపామని ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో మరో 19 మంది గల్లంతు అయ్యారు.
మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ అధికారులు మృతదేహాల భాగాలకు డీఎన్ఏ పరీక్షలు చేశారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు.
ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలున్నాయి. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థలో మంటలు ఆరంభమై భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని తెలిపారు. ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి సేఫ్టీ క్లియరెన్స్ లేదు. ఆ భావన యజమాని మనీష్ లక్రాగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న కంపెనీ యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంటలు చెలరేగినప్పుడు రెండవ అంతస్తులో మోటివేషన్ స్పీచ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమిదే కావొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ఈ అంతస్తులో నుంచి మృతుల సంఖ్య మరింత బయటపడొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక మెట్లు ద్వారం మాత్రమే ఉన్నందున ప్రజలు భవనం నుంచి తప్పించుకోలేక పోయారని అగ్ని మాపక శాఖ డివిజనల్ అధికారి తెలిపారు.