లిక్కర్, ఇసుక మాఫియాపై వార్తలు రాసినందుకు ఒక పాత్రికేయుణ్ణి ఆయన ఇంటి వద్దనే తుపాకితో కాల్చి చంపిన దారుణ సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బెగుసరాయి జిల్లా బఖ్రి పోలీస్ స్టేషన్ పరిధి సఖో గ్రామానికి చెందిన 26 ఏళ్ల సుబాష్ కుమార్ మహతో స్థానిక హిందీ పత్రికలకు స్ట్రింగర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం పబ్లిక్ యాప్ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్థానిక కేబుల్ ఛానెల్ సిటీ న్యూస్ తరపున విలేకరిగా పనిచేస్తున్నారు. స్నేహితుని పెళ్లి విందుకు వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. తలకు గురిపెట్టి తుపాకితో కాల్చడంతో అయన ప్రాణాలు కోల్పోయారు.
ఇది ఇసుక, లిక్కర్ మాఫియా పనేనని కుటుంబ సభ్యులు, స్నేహితులు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి నలుగురు నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు.
నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, మహతో కుటుంబానికి పరిహారం చెల్లించాలని, స్టానిక పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఒను బదిలీ చేయాలని స్థానిక జర్నలిస్టులు బెగుసరారు ఎస్పి యోగేంద్రకుమార్ను కలిసి, విజ్ఞప్తి చేశారు.
అతను జర్నలిజం వృత్తిలోకి వచ్చి నాలుగేళ్లే అయినప్పటికీ స్థానికంగా నిర్భయంగా, నిజాయతీతో వ్రాసే వార్తలతో పేరొందారు.