సెక్స్ వర్క్‌ను వృత్తిగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. ఈ వృత్తిని ఆచరించేవారు గౌరవానికి అర్హులని, చట్టం కింద వారికి కూడా సమానమైన రక్షణ వుంటుందని స్పష్టం చేసింది. వారి వృత్తిలో పోలీసులు జోక్యం చేసుకోరాదని, వయోజన, కన్సెంటింగ్ సెక్స్ వర్కర్లపై నేరపూరితమైన చర్యలు తీసుకోరాదంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
”వృత్తితో సంబంధం లేకుండా రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద పరువు మర్యాదలతో జీవించే హక్కు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.” అని కోర్టు వ్యాఖ్యానించింది. ”చట్టం కింద సెక్స్ వర్కర్లకు సమానమైన రక్షణ వుంటుంది. ‘వయస్సు, సమ్మతి’ ప్రాతిపదికన అన్ని కేసుల్లో క్రిమినల్ చట్టాన్ని సమానంగా వర్తింపచేయాలి” అని తెలిపింది.
పైగా సెక్స్ వర్కర్ వయోజనులై వుండి, పూర్తి సమ్మతితోనే ఇందులో పాల్గొన్నపుడు వారిపై పోలీసులు ఎలాంటి నేరపూరితమైన చర్య తీసుకోరాదని లేదా వారి విషయంలో అస్సలు జోక్యం చేసుకోరాదని జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద ప్రత్యేక అధికారాలను అమలు చేసిన తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేయడమనేది చట్టవిరుద్ధం కానందున, కేవలం బ్రోతల్ సంస్థ నిర్వహణే చట్ట విరుద్ధమైనందున ఏ బ్రోతల్ సంస్థ పైనైనా దాడి చేసినపుడు ఏ సెక్స్ వర్కర్‌ను కూడా అరెస్టు చేయరాదని, శిక్షించరాదని లేదా వేధించరాదని లేదా బాధించరాదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే వేశ్య వృత్తిలో వుందనే కారణంతో సెక్స్ వర్కర్ పిల్లలను కూడా వారి తల్లి నుండి వేరు చేయరాదని పేర్కొంది. కనీసపు పరువు మర్యాదలతో జీవించడమనే ప్రాథమిక హక్కు, రక్షణ అనేది సెక్స్ వర్కర్లకు, వారి పిల్లలకు కూడా దక్కాలని కోర్టు స్పష్టం చేసింది.
పైగా, బ్రోతల్ హౌస్‌లో లేదా సెక్స్ వర్కర్ల దగ్గర మైనర్ బిడ్డ వుందని కనుగొంటే ఆ బిడ్డను అక్రమంగా రవాణా చేసిన బిడ్డగా భావించరాదని పేర్కొంది. ఒకవేళ ఆ బిడ్డ తమ బిడ్డేనని ఆ సెక్స్ వర్కర్ చెబితే దాన్ని నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలు చేయవచ్చని పేర్కొంది. అంతేకానీ ఆ మైనర్‌ను తల్లి నుండి వేరు చేయరాదని తెలిపింది.
క్రిమినల్ ఫిర్యాదు చేసిన సెక్స్ వర్కర్లపై ముఖ్యంగా వారిపై జరిగిన నేరం లైంగిక స్వభావానికి సంబంధించినదైతే వారిపై ఎలాంటి వివక్ష చూపరాదని పోలీసులను కోర్టు ఆదేశించింది. లైంగిక దాడి బాధితులైన సెక్స్ వర్కర్లకు తక్షణమే మెడికో లీగల్ సంరక్షణను అందించడంతో సహా ప్రతి సదుపాయాన్ని అందించాలని స్పష్టం చేసింది.
సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి తరుచుగా చాలా దారుణంగా, క్రూరంగా, హింసాత్మకంగా వుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. హక్కులను గుర్తించని ఈ వర్గం పట్ల సున్నితంగా వ్యవహరించాలని కోరింది. అరెస్టు సమయంలో, రెయిడ్ చేసేటపుడు, రెస్క్యూ ఆపరేషన్లపుడు సెక్స్ వర్కర్ల గుర్తింపులను వెల్లడించకుండా మీడియా జాగ్రత్త వహించాలని కోర్టు సూచించింది.
బాధితులైనా లేదా నిందితులైనా వారి ఫోటోలు గానీ లేదా ఇతర సమాచారం గానీ ప్రచురించరాదని, లేదా ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. వాయోరిజం (బ్లూ ఫిలింలు వంటివి) అనేది క్రిమినల్ నేరమని కోర్టు గుర్తు చేసింది.
కండోమ్ ఉపయోగించడం వంటి సెక్స్ వర్కర్లు తీసుకునే చర్యలను పోలీసులు వారి నేరాలకు సాక్ష్యాధారాలుగా పరిగణించరాదని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు సబంధించి సంస్కరణల చట్టాలు రూపొందించేటపుడు సెక్స్ వర్కర్లను లేదా వారి ప్రతినిధులను అందులో భాగస్వాములను చేయాలని కేంద్ర, రాష్ట్రాలకు కోర్టు సూచించింది.