తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
మున్నూరు కాపు (బీసీ) కులానికి చెందిన లక్ష్మణ్ గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణ మీద ఫోకస్ పెంచిన బిజెపి నాయకత్వం ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని మొదటి నుంచి భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రం నుంచి పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తుండడంతో బీసీ కులానికి చెందిన నేతను ఎంపిక చేయాలని భావించారు. అందులో భాగంగానే లక్ష్మణ్ పేరును పార్టీ నాయకత్వం రాజ్యసభకు ఖరారు చేసింది.
తెలంగాణ నుండి బిజెపి అభ్యర్థిగా రాజ్యసభకు వెడుతున్న మొదటి నాయకుడు ఆయనే కాబోవడం గమనార్హం. హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుండి గతంలో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
పార్టీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్ ఇద్దరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే వాతావరణం నెలకొనడంతో ఇక్కడి పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపేందుకు, బీసీ ఓటు బ్యాంకు పెంచుకొనేందుకు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తనకు రాజ్యసభ అవకాశం కల్పించడం పట్ల కె.లక్ష్మణ్ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘సాధారణ కార్యకర్తకు లభించిన గౌరవం, గుర్తింపు ఇది. బీజేపీ తప్ప మరే పార్టీలోనూ ఇది సాధ్యం కాదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
1956 జూలై 3న హైదరాబాద్లో జన్మించిన లక్ష్మణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేశారు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీసీ–మున్నురుకాపు çవర్గానికి చెందిన లక్ష్మణ్ ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పనిచేశారు.
1980లో బీజేపీలో చేరారు. 1995–1999 మధ్య పార్టీ హైదరాబాద్ నగరశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016–2020 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది.