రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మిత్రపక్షాలు కుల గణన కోసం డిమాండ్ పై పట్టుబడుతున్న తరుణంలో, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బిజెపి ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసిలు), దళితులపై దృష్టి సారించడం ద్వారా వారి “రాజకీయ సాధికారత” ఫార్ములాను ఎంచుకుంది.
జూన్ 10న జరిగే రాజ్యసభకు జరిగే ఎన్నికల కోసం ఆది, సోమవారాల్లో ప్రకటించిన 22 మంది అభ్యర్థుల్లో సగానికి పైగా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉండడం గమనార్హం.
తొమ్మిది మంది ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కుల గణనపై రాజకీయాలు ముదురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినట్లు స్పష్టం అవుతుంది.
అభ్యర్థుల జాబితా 2014 నుండి పార్టీ తన ఎన్నికల పోరాటాలలో సాయపడిన సోషల్-ఇంజనీరింగ్ ఫార్ములాకు అనుగుణంగా ఈ ఎంపిక చేసిన్నట్లు వెల్లడి అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఆ రాష్ట్రంలోని ఓబిసి-దళిత ఓటు పునాదియే కారణమని బిజెపి నాయకత్వం భావిస్తున్నది.
అగ్రవర్ణాలు, మహిళల రాజకీయ ఆకాంక్షలను కూడా బీజేపీ పరిగణలోకి తీసుకోండి. తొలుత కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ (కర్ణాటక నుంచి), పీయూష్ గోయల్ (మహారాష్ట్ర నుంచి)లను పార్టీ నామినేట్ చేసింది. 22 మందిలో ఆరుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ జాబితాలో, పార్టీ అగ్రవర్ణాల నుండి ఇద్దరు నాయకులకు స్థానం కల్పించింది – లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ , రాధా మోహన్ దాస్ అగర్వాల్ లతో పాటు ఆరుగురిని బలహీన వర్గాల నుండి ఎంపిక చేసింది. ఆ ఆరుగురు సురేంద్ర సింగ్ నగర్, బాబూరామ్ నిషాద్, సంగీత యాదవ్, దర్శన సింగ్, మిథిలేష్ కుమార్, కె లక్ష్మణ్.
బీహార్ నుండి ఓబిసి నాయకుడు శంభు శరణ్ పటేల్, బ్రాహ్మణుడైన సతీష్ చంద్ర దూబేని ఎంపిక చేసింది. కర్ణాటకలో, సీతారామన్‌తో పాటు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు సన్నిహితుడిగా భావించే వొక్కలిగ వర్గానికి చెందిన మాజీ నటుడు జగీష్, పార్టీ మాజీ కోశాధికారి లహర్ సింగ్ సిరోయాను నామినేట్ చేసింది.
మధ్యప్రదేశ్‌లో, ఇద్దరు మహిళలను ఎంపిక చేసింది. వారు సుమిత్రా వాల్మీకి (దళిత) కాగా, కవితా పటీదార్, ఓబిసి నాయకురాలు. ఉత్తరాఖండ్ నుండి పార్టీ అభ్యర్థి కల్పనా సైనీ కూడా వెనుకబడిన వర్గానికి చెందినవారే.
మహారాష్ట్ర నుంచి అభ్యర్థి అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బోండే ఓబీసీ వర్గానికి చెందినవారు కాగా, రాజస్థాన్‌లోని ఘన్‌శ్యాం తివారీ బ్రాహ్మణ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో కొన్నాళ్ల క్రితం పోటీ పడ్డారు. బిజెపి అగ్ర నాయకత్వంతో రాజేకు అంతగా లేని సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే, తివారీ రాజ్యసభ నామినీగా తిరిగి రావడం మాజీ సిఎం, ఆమె శిబిరానికి స్పష్టమైన సందేశాన్ని పంపినట్లయింది.
హర్యానా నుండి, దళిత నాయకుడు క్రిషన్ లాల్ పన్వార్ ఎగువ సభకు ఎంపికయ్యారు. జార్ఖండ్‌లో పార్టీ అభ్యర్థిగా ఓబిసి వర్గానికి చెందిన ఆదిత్య సాహు ఉన్నారు. జనతాదళ్ (యునైటెడ్) కోటా నుండి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆర్‌సిపి సింగ్‌ను తిరిగి నామినేట్ చేయమని నితీష్ కుమార్ పై ఒత్తిడి చేయకుండా బిజెపి రాజకీయ పరిణితి ప్రదర్శించింది.
మరోవంక, కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు సీట్ దక్కలేదు. ఆయనతో పాటు సీనియర్ నేత ఓపి మాథుర్, బిజెపి ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినయ్ సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు అవకాశం దక్కలేదు. రాజ్యసభలో బిజెపి చీఫ్‌విప్, కేంద్ర మాజీ మంత్రి శివప్రతాప్ శుక్లా కూడా చోటు దక్కలేదు.