2020లో భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో అప్పటి అస్సాం ఆరోగ్య మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన భార్య, కొడుకు వ్యాపార భాగస్వాముల కంపెనీలకు మార్కెట్ ధరలకు మించి పిపిఇ కిట్లను సరఫరా చేయడానికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారని తీవ్రమైన ఆరోపణలు చెలరేగుతున్నాయి.
ఈ విషయమై మీడియాలో పలు కధనాలు వెలువడ్డాయి. ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నాయకుడు సత్యాంధ్ర జైన్ ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నాలుగు రోజులకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కథనాలను మీడియా సమావేశంలో ఉటంకించారు. శర్మ ఇతర కంపెనీల నుండి పిపిఇ కిట్లను రూ. 600 చొప్పున కొనుగోలు చేయగా, తన భార్య, కొడుకుల వ్యాపార భాగస్వాముల సంస్థలకు రూ. 990 చొప్పున అత్యవసర సరఫరా ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి శర్మ, ఆయన భార్య రింకు భుయాన్ తీవ్రంగా ఖండించారు. తన భార్య ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, పైగా అస్సాంలో ఒక్క పిపిఇ కిట్ కూడా లేని సమయంలో ఆమె 1500 కిట్ లను ఉచితంగా సరఫరా చేసిందని ఆయన చెప్పారు. అవాస్తవమైన ఆరోపణలతో పరువు నష్టం కలిగించినందుకు క్రిమినల్ కేసు దాఖలు చేయబోతున్నట్లు వెల్లడించారు.
శర్మ భార్యకు చెందిన కంపెనీ కనీసం వైద్య పరికరాలను కూడా డీల్ చేయక పోయినా ఈ ఆర్డర్ ఇవ్వడం గమనార్హమని సిసోడియా పేర్కొన్నారు. పిపిఇ కిట్లను సరఫరా చేయలేకపోవడంతో శర్మ భార్య కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయగా, అతని కుమారుడి వ్యాపార భాగస్వాములకు చెందిన సంస్థకు కిట్‌కు రూ. 1,680 చొప్పున మరో సరఫరా ఆర్డర్‌ను ఇచ్చారని సిసోడియా చెప్పారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మంత్రులను అవినీతి ఆరోపణలతో కేంద్రం ప్రభుత్వం వేధిస్తుండగా, బీజేపీ తమ పార్టీ అధికారంలో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారని సిసోడియా ప్రశ్నించారు.
“వారు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అవినీతిపై వారి అవగాహనను నేను విచారించాలనుకుంటున్నాను. వారు ఈ (అస్సాం కేసు) అవినీతిని పరిగణించారా? లేదా? అని వారిని అడగాలనుకుంటున్నాను” అని సిసోడియా స్పష్టం చేశారు.
కల్పిత అవినీతి ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేయగా, ఆయన “నిందితుడు కాదు” అని కేంద్రం కోర్టుకు ఏవిధంగా తెలిపినదని ఆయన ప్రశ్నించారు. గంటల కొద్దీ విచారణ అనంతరం మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఈడీ మే 30న అరెస్టు చేసింది.
జైన్, ఆయన భార్య ఫిబ్రవరి 2015 నుండి మే 2017 మధ్యకాలంలో రూ. 1.47 కోట్ల విలువైన అసమాన సంపదను కూడబెట్టారని, వారికి తెలిసిన ఆదాయ వనరుల కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది.
కాగా, జైన్ అరెస్ట్ పై తీవ్రంగా స్పందించిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రభుత్వంలో మరో మంత్రి అరెస్టు కానున్నారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఇరికించాలని చూస్తున్నారని, సత్యేంద్ర జైన్ తర్వాత ఆయనే అరెస్టు కానున్నారని తెలిపారు. ‘మమ్మల్నందర్ని కలిపి జైలులో తోసేయండి ‘ అని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. సిసోడియాపై తప్పుడు కేసులు బనాయించాలని అన్ని ఏజెన్సీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందని ఆయన ఆరోపించారు