ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే, కేసీఆర్ ప్రభుత్వం 18 శాతానికి కుదించి బీసీలకు అన్యాయం చేసిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన కుల వృత్తిదారుల సదస్సులో పాల్గొంటూ రాష్ట్రంలో 54 శాతం ఓబీసీలు ఉంటే కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం ముగ్గురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. మరోవంక, కేవలం ఒక్కశాతం జనాభా సామాజిక వర్గంకు చెందిన నలుగురు మంత్రులు ఉన్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని అవినీతి, అక్రమ, నియంతృత్వ కేసీఆర్ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తామని, త్వరలోనే మోదీ, యోగి జోడీ తరహా పాలనను తెలంగాణ ప్రజలు చూస్తారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. యూపీ నుంచి బుల్డోజర్ వస్తోందని, కేసీఆర్ దోచుకున్న అక్రమాస్తులను కూల్చేసి, స్వాధీనం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు, అబద్ధాలకోరని లక్ష్మణ్ ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి, చివరకు జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి తెచ్చారని మండిపడ్డారు.
‘‘కేసీఆర్ పాలన ‘అహ నా పెళ్లంట’సినిమాలా ఉంది. ఆ సినిమాలో కోడిని పైకప్పుకు కట్టిన కోటా శ్రీనివాసరావు దాన్ని చూస్తూ చికెన్‌తో భోజనం చేసినట్టుగా ఫీలవుతాడు. అట్లనే ఎర్రవల్లిలో ఇండ్లు కట్టిన కేసీఆర్, అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి, ఓట్లు వేయించుకున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత కూడు, గూడు, జాబు లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. కేంద్రం పథకాలను చూపిస్తూ కేసీఆర్ సోకులు పడ్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, దివాలా తీయించారని లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తానని సీఎం దగా చేశారని తెలిపారు.
అంతకుముందు వివిధ కులవృత్తుల వారు లక్ష్మణ్‌ను సన్మానించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాగా, యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చిన లక్ష్మణ్.. ప్రధానాలయంలోని మూల మూర్తులను దర్శించుకుని, ముఖ మండపంలోని ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాక ఇలవేల్పు దైవం లక్ష్మీనారసింహుడి దర్శనం కోసం వచ్చానని లక్ష్మణ్ చెప్పారు.