మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్యెల్యేలను, ఆ తర్వాత ఒక ఎంపీని గెలిపించుకున్న తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు ఎమ్యెల్యేలను గెలిపించుకున్న తర్వాత అకస్మాత్తుగా జాతీయస్థాయి నేతగా ఎదిగిన్నట్లయింది. అన్ని రాష్ట్రాలలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు.
అయితే, గత ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలలో అభ్యర్థులను నిలబెట్టి, ఎక్కడ తన ఉనికి చాటుకోలేక పోవడంతో ఒకింత నిరుత్సాహంకు గురయ్యారు. తాజాగా, ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్ లో 90మంది అభ్యర్థులను నిలబెట్టి, హడావుడి చేసినా ప్రయోజనం లేకపోయింది. దానితో ఇప్పుడు గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.
బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీతో చర్చలు ముగిసాయని, తొందరలోనే విలీన ప్రక్రియ ఉంటుందనే వాదనలూ వస్తూనే ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రోజు నుంచే పెద్ద పార్టీలు తమను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని బిహార్ ఎంఐఎం పక్ష నేత, ఎమ్మెల్యే అక్తరుల్ ఇమామ్ ఓ సందర్భంలో అన్నారు.
అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బిహార్‌లోని ఎంఐఎం ఎమ్మెల్యేల ఆలోచనలు మారిపోయాయని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో 90 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిన ఎంఐఎం.. ఏ ఒక్క స్థానం గెలవకపోగా కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయింది. యూపీలో 20 శాతం ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఎంఐఎం కేవలం ఒకే ఒక్క శాతం ఓట్ బ్యాంక్‌కు పరిమితమైంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ గెలవాల్సిన 20 స్థానాల్లో కూడా మజ్లిస్ పార్టీ గండికొట్టింది. బిజెపి ప్రోత్సాహంతో ఒవైసి పెద్ద ఎత్తున అభ్యర్థులను నిలబెట్టి, ఆర్జేడీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లలోని ముస్లింలు ఒవైసీని బిజెపి ఏజెంట్ గా భావిస్తూ ఉండడంతో, ఆయన పట్ల విశ్వాసం కోల్పోయిన్నట్లు చెబుతున్నారు.
వచ్చే రోజుల్లో బిహార్‌లో సైతం ఇవే పరిస్థితులు రావొచ్చని ఎంఐఎం నేతలు భావిస్తున్నారట. తమ భవిష్యత్‌ను దృష్టిల్లో పెట్టుకుని ఆర్జేడీలోకి వెళ్తే 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవచ్చని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.