నుపుర్ శర్మ చేసిన వాఖ్యల సాకుతో రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మసీద్ లో ప్రార్ధనల అనంతరం విధ్వంస చర్యలకు పాల్పడినవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది.
ఈ ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను అధికారులు వరుసగా రెండో రోజూ ధ్వంసం చేశారు.
శనివారం బుల్డోజర్లతో వెళ్లి నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు.. ఆదివారం కూడా ఆ పనిని కొనసాగించారు. ప్రయాగ్‌రాజ్ అల్లర్ల సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు.
మే 10న నోటీసులు ఇచ్చామని, మే 24న సమాధానమిస్తానన్న జావేద్ స్పందించకపోవడంతో మే 25న కూల్చివేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జావేద్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. షహరాన్‌పూర్‌లో ఇద్దరు నిందితుల అక్రమ నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు.
యూపీలో ఆందోళనకారులపై ఇద్దరు పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్న 30 సెకన్ల వీడియోను బీజేపీ ఎమ్మెల్యే, సీఎం యోగి మాజీ మీడియా సలహాదారు శలభ్ మణి త్రిపాఠీ ట్విటర్లో పోస్ట్ చేశారు. దానికి ‘అల్లరిమూకలకు రిటర్న్ గిఫ్ట్’ అని శీర్షిక పెట్టారు.
ఇక జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం పోలీసులు వేలాది మంది ఆందోళనకారులపై 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని జామా మసీదు వద్ద అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న మహ్మద్ నదీమ్, ఫహీంలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, కాన్పూర్ హింస పథకం ప్రకారం జరిగిన కుట్రని వీహెచ్‌పీ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఆరోపించారు. కాగా, నూపుర్ శర్మ వివాదంలో తప్పుడు ప్రచారమంతా పాకిస్థాన్ సోషల్ మీడియా పననేని డిజిటల్ ఫోరెన్సిక్ సెంటర్ పేర్కొంది.
ఇలా ఉండగా, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.
ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.