అస్సాంలో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. భారీ వరదలు పోటెత్తడంతో చాలా మంది ప్రజలు నిరాశ్రయిలవుతున్నారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో పాటు దాని ఉప నదులు ఉప్పొంగడంతో ఈశాన్య రాష్ట్రంలో దాదాపు 48 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది.
వరదల కారణంగా.. 449 గ్రామాల్లోని 2 లక్షల 07 వేల 143 మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. వరదల వల్ల 113485.37 హెక్టార్ల పంట నష్టానికి గురైందని అంచనా వేస్తున్నారు. 33 లక్షల 84 వేల 326 జంతువులపై ఎఫెక్ట్ పడిందని, ఇందులో 5 వేల 232 పశువులు కొట్టుకుపోయాయని పేర్కొంది.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగింది. బరాక్ లోయలో ఉన్న కాచర్ కు సిబ్బందిని తరలించారు. భువనేశ్వర్ నుంచి నాలుగు యూనిట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించామని ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ తెలిపారు.
ఏర్పాటు చేసిన 810 సహాయ శిబిరాలకు 2 లక్షల 31 వేల 819 మందిని తరలించారు. 615 తాత్కాలిక పంపిణీ కేంద్రాల ద్వారా సహాయక సామాగ్రిని అందించారు. నిమతి ఘాట్, తేజ్ పూర్, గౌహతి, ధుబ్రీ, గోలపరా ప్రాంతాల వద్ద బ్రహ్మపుత్ర నది పోటెత్తుతోందని సెంట్రల్ వాటర్ కమిషన్ బులెటిన్ లో వెల్లడించింది.
నాగోన్ జిల్లాలోని కంపూర్ వద్ద కోపిలీ నది స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరదల కారణంగా రైళ్లను రద్దు చేశారు అధికారులు. కొన్నింటిని దారి మళ్లించింది. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి.