తమిళనాడులో అన్నాడీఎంకే మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకొంది. పార్టీకి ఎవ్వరో ఒక్కరే నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాలు డిమాండ్ చేస్తుండడంతో గురువారం జరుగవలసిన పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏవిధంగా మారనున్నాదో అన్న ఆసక్తి చెలరేగుతుంది.
జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో బుధవారం జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గీయులు తమ తమ డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయడానికి సిద్ధపడుతున్నారు. తద్వారా పన్నీర్ సెల్వం ప్రాధాన్యత తొలగించే సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు ఆయన పోలీసులను ఆశ్రయించాడు.
అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు.