హైదరాబాద్ లో 20 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని ఆ సమావేశాల స్టీరింగ్ కమిటీ చైర్మన్, జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాట్లకు సంబంధించి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ పనిచేస్తోందని లక్ష్మణ్ తెలిపారు.
భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని, సుమారు 10 లక్షల మంది ఈ సభకు వస్తారని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో వివిధ వర్గాల వారు ఉన్నారని..వారందరితో కలిపి ఒక సమ్మేళనం నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని చెబుతూ .రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
అమరవీరుల కుటుంబాలను పక్కనపెట్టి తెలంగాణ ద్రోహులను కేసీఆర్ పక్కనబెట్టుకున్నాడని లక్ష్మణ్ ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశం మొత్తం తిలకించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకతీయుల సామ్రాజ్యం, నిజాం సామ్రాజ్యంపై పోరాడిన వారి ఫోటోలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ వాస్తవ పరిస్థితులు దేశవ్యాప్తంగా తెలుస్తుందని చెప్పారు. ఈ సమావేశాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోతుందని, అధికారంలోకి రాబోయెడిది బిజెపి మాత్రమే అన్న సందేశం ప్రజలకు చేరుతుందని భరోసా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ తోడుదొంగలని చెబుతూ ప్రజలను మోసం చేయడమే వాటి పని అని డా. లక్ష్మణ్ విమర్శించారు.
సమావేశాల ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ్ ప్రకాశ్ సమీక్షించారు.