తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకెలో వివాదం గురువారం తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడిఎంకె అధినేత ఒ.పన్నీర్‌సెల్వంపై ప్రత్యర్థి నేత ఎడప్పడి పళనిస్వామి (ఇపిఎస్) మద్దతుదారులు వాటర్‌బాటిల్స్‌తో దాడికి దిగారు.
అన్నాడిఎంకెకి ఒకే అధ్యక్షుడు ఉండాలన్న ప్రత్యర్థి ఎడప్పడి పళనిస్వామి డిమాండ్‌ను సీనియర్ నేతలు సమర్థిస్తూ.. నినాదాలు చేయడంతో పన్నీర్ సెల్వం వాకౌట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ఇపిఎస్ అనుచరులు బాటిల్స్ విసిరికొట్టారు. కోర్టు ఆదేశాల మేరకు ఏక నాయకత్వం తీర్మానాన్ని ఆమోదించాలన్న పళనిస్వామి డిమాండ్‌ను పన్నీర్‌సెల్వం ఆమోదించలేదు.
పన్నీర్‌సెల్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన అంగీకరించిన మొత్తం 23 ముసాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్థి షణ్ముగం పేర్కొన్నారు. ఏక నాయకత్వమే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. సమావేశం ప్రారంభంలో ఇరు వర్గాల మద్దతుదారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పళనిస్వామి ఆహ్వానం మేరకు ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి =హాజరైన ఒ.పన్నీర్‌సెల్వంపై పళనిస్వామి వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వాటర్ బాటిల్స్ విసిరేసి మరీ వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. పరిస్థితులన్నీ తనకు ప్రతికూలంగా మారడంతో చేసేదేమీ లేక పన్నీరుసెల్వం, ఆయన మద్దతుదారులు సమావేశం మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయారు.
ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో సమావేశం నుంచి పన్నీర్ సెల్వం మధ్యలోనే వెళ్లి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా, జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి పన్నీర్ సెల్వానికి ఊరట కలిగించిన విషయం ఏంటంటే 23 తీర్మానాలపై మాత్రమే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని, ఇతర విషయాలపై చర్చ మాత్రమే జరగాలని మద్రాస్ హైకోర్టు గురువారం తెల్లవారుజామున 4.20 నిమిషాలకు ఆదేశాలు జారీ చేసింది.
జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో జస్టిస్ ఎం.దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు విని ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. ఏక నాయకత్వంపై సర్వసభ్య నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
తనవారనుకున్న నేతలంతా దూరమై, పార్టీపై పూర్తిగా పట్టు కోల్పోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్ వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్‌కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.
2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్‌కు అనతికాలంలోనే పదవీగండం ఎదురైంది. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఓపీఎస్.. తనను పదవి నుంచి తప్పించిన శశికళపై ‘ధర్మయుద్ధం’ పేరుతో తిరుగుబాటు చేశారు. అయినా ఆయన తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.
శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆ తరువాత ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే ఆ పెద్దల సూచనతో ఓపీఎస్‌ను పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి సైతం కట్టబెట్టారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో పార్టీ సమన్వయకర్తగా ఓపీఎస్, ఉపసమన్వయకర్తగా ఈపీఎస్‌కు పదవుల పందేరం జరిగింది.
ఈపీఎస్ ఉపసమన్వయకర్తగా వున్నా పార్టీలో ఆయనదే పైచేయిగా నిలిచింది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండడంతో ఆయన మాటే చెల్లుబాటయింది. అప్పటి నుంచి పార్టీపై పూర్తిగా పట్టు సాధించిన ఈపీఎస్.. తరువాతి కాలంలో మరొకరితో పగ్గాలు పంచుకునేందుకు విముఖత కనబరుస్తూ వచ్చారు.
పార్టీలో క్రియాశీలకమైన 60 మంది జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది తన వెంటే ఉండడంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 66 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా ఈపీఎస్ వెంట వుండడం కూడా ఆయనకు ధైర్యాన్నిచ్చింది. దీనికి తోడు ఓపీఎస్ శశికళతో సన్నిహితంగా ఉండడం, ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో తనను సాగనంపేందుకు కుట్ర జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్.. ‘ఏకనాయకత్వం’ అంశాన్ని తెరపైకి తెచ్చారు.