కేరళ వాయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ నాయకులు దాడి చేసారు. సుమారు వందకు పైగా నాయకులు జెండాలు, కర్రలతో చొచ్చుకొని వచ్చి కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ భద్రత పెంచారు. ఈ దాడిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కేరళలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని ఈ దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మండిపడ్డారు. పోలీసుల సమక్షంలో దాడి జరగడం దారుణమని అంటూ బఫర్ జోన్ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని, అయితే దీనితో రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటో అన్నది అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళ సీఎం మాత్రమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌తోపాటు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఎస్ఎఫ్ఐ యువకులు ఏ కారణంతో రాహుల్ కార్యాలయంపై దాడి చేశారో తమకు అర్థం కావడం లేదని థెయ్ల్పారు.
ఈ దాడికి చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా… కేరళలోని సీపీఎం ప్రభుత్వమే ఈ దాడికి బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేరళ పోలీసుల కళ్లెదుటే దుండగులు దాడికి దిగారని కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. వెరసి ఈ దాడి వెనుక సీపీఎం ఉందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై కేరళ సీఎం పినరయి విజయన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.