పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పూరీ జగన్నాథ రథయాత్ర చేపట్టలేదు. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈసారి భక్తులకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో నిన్నటి నుంచే పూరీ నగరంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఈసారి రథయాత్రకు దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారు.
కాగా, పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం.
పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.
ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. అది మీ వైపే తిరిగినట్టు అనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత.
సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునక వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది. జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు.
జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా? లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.
పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. మొత్తం తినేస్తారు. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.
పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది రథయాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.
పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారుఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉండిపోయింది .
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.