రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్ధేశం చేశారు. రెండు రోజుల పాటు జరిగిన వైసిపి ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం ఆయన ముగింపు ప్రసంగం చేశారు.
‘2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి కార్యకర్త పని చేయాలి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతవుతాయి. బాబుకు ఓటు వేయడం అంటే వాటిని నిలిపివేయాలని కోరినట్టే. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. విస్తృతంగా ప్రచారం చేయాలి.’ అని ఆయన చెప్పారు.
అంతకుముందు వైసిపి శాశ్వత (జీవిత కాలపు జాతీయ) అధ్యక్షునిగా జగన్మోహన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యక పోవడంతో జీవితకాలపు జాతీయ అధ్యక్షునిగా జగన్ ఏకగ్రీవంగా ఎనిుకయ్యారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య విజయసాయి రెడ్డి ప్రకటించారు.
రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్టచతుష్టయం, పార్టీ నిబంధనావళిలో స్వల్పమార్పులు అనే ఆరు ఆంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. పార్టీ నిబంధనావళిలో పార్టు వన్ ఆర్టికల్ వన్లో పేర్కొన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)గా గుర్తించాలని, ఆర్టికల్ 8, 9లో జీవితకాలపు అధ్యక్షుని ఎన్నికకు వీలుగా సవరణను ప్రతిపాదించారు.
మొత్తం పది తీర్మానాలు ఆమోదం పొందినట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అనంతరం అధ్యక్షహోదాలో ముగింపు ప్రసంగం చేసిన జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి, ఇప్పటిదాకా చేసిందేమిటన్నది వివరించారు. వైసిపిని గెలిపిస్తే రాష్ట్ర భవిష్యత్ బాధ్యత తనదని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ వైసిపి ఎమ్మెల్యేలు గెలుపొందాలని, ఆ మేరకు విశ్రాంతి లేకుండా పనిచేయాలని కోరారు. బూత్ కమిటీల్లో కూడా సామాజిక న్యాయం పాటించాలని చెప్పారు. వైసిపిని, జగన్ను రాజకీయల్లో లేకుండా చేయాలని జరిగిన ఎన్నో కుట్రలను ఎదిరించి ఇప్పటిదాకా ప్రయాణం చేశామని చెప్పారు.
ఒక్క ఎంపీ, ఎంఎల్ఏ తో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 22 మంది ఎంపిలు, 151 మంది శాసనసభ్యులకు చేరిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీని పెత్తందారుల పార్టీగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబునాయుడి హయంలో ఆ పార్టీ పెత్తందారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, వారి సంక్షేమం అభివృద్ధి కోసమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు.
దానికి భిన్నంగా వైసిపి పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. దీనినిస హించలేకే వైసిపి ఓటమికి దుష్టచతుష్టయం పనిచేస్తోందని మండిపడ్డారు. ఒక పేద, రైతు, దిగువ మధ్య తరగతి కుటుంబం సభ్యులు వారి అవసరాలు ఆర్థికంగా ఇబ్బదులు లేకుండా చూడాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని, హామీలు 95 శాతం అమలు చేశానని తెలిపారు.
బిజెపితో పొత్తు ఉండదు
రాష్ట్ర్ర అవసరాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని, అయితే ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉండదని వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన ప్రసంగంలో తేల్చి చెప్పారు.