అన్నాడీఎంకేలో రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) చేతికి వచ్చాయి. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పళని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
పార్టీని తన నియంత్రణలోకి తీసుకొన్న కొద్దిసేపటికే ప్రత్యర్థి నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)పై ఈపీఎస్ చర్యలు తీసుకొన్నారు. ఆయనను కోశాధికారి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఆయనతో పాటు ఓపీఎస్ మద్దతుదారులను కూడా పార్టీ నుంచి తొలగించారు.
అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ వ్యవహారంపై పళని, పన్నీర్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పళని నేతత్వంలో సర్వసభ్య సమావేశంపై నిషేధం విధించాలని పన్నీర్ సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన కాసేపటికే పళని నేతత్వంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈపీఎస్ వర్గం తీసుకొచ్చిన 16 తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది. పళనిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించే తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
ఈ సందర్భంగా ఓపీఎస్, అతడి మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించేందుకు తీసుకొచ్చిన ప్రత్యేక తీర్మానానికి కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అన్నాడీఎంకే వెల్లడించింది.
పార్టీ నిర్ణయంపై పన్నీర్ సెల్వం తీవ్రంగా స్పందిస్తూ తాను 1.5కోట్ల మంది పార్టీ కార్యకర్తల చేత అన్నాడీఎంకే కో ఆర్డినేటర్‌గా ఎన్నికయ్యాయని తెలిపారు. తనను పార్టీ నుంచి బహిష్కరించే హక్కు పళనిస్వామికి లేదని స్పష్టం చేశారు. ఈపీఎస్‌నే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై తాను కోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.