అన్నాడీఎంకే నుండి బహిష్కరణకు గురవడం, ఉన్నత న్యాయస్థానాలలో, ఎన్నికల కమీషన్ వద్ద కూడా వెంటనే సానుకూల స్పందన లభించక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఇక మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళతో కలసి రాజకీయ ప్రయాణం సాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అన్న చందాన అన్నాడీఎంకే తాజా బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం మరో బహిష్కృత నాయకురాలు వీకే శశికళతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం తనకు పక్కకు నెట్టివేసి అన్నాడీఎంకేపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించిన తన ప్రత్యర్థి ఎడప్పాడి పళనిస్వామి పని పట్టాలంటే ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని గట్టిగా భావిస్తున్న ఓపీఎస్.. ఆ మేరకు ఇప్పటికే శశికళతో మంతనాలు జరిపినట్లు తెలిసింది.
అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఓపీఎస్ తన మద్దతుదారులతో పోటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతో పాటు, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ, టీటీవీ దినకరన్()తో కలిసి పనిచేయాలని ఓపీఎస్ నిర్ణయించారు.
దీన్ని రుజువు చేసేలా ఇటీవల దినకరన్‌కు తేని జిల్లాకు చెందిన ఓపీఎస్ మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. వీటన్నింటినీ పరిశీలిస్తే త్వరలోనే ఓపీఎస్, శశికళ, దినకరన్ ఒకే వేదికపై కనిపించే అవకాశముందని అన్నాడీఎంకేకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.