ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై జరుగుతున్న సిబిఐ దర్యాప్తులో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుమార్తె డా. వై ఎస్ సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కేసులో ఏమాత్రం పురోగతి సాధించలేకపోతున్నారని ఆరోపిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారంటూ ఆమె తన పిటిషన్లో ప్రస్తావించారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోరారు.
ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటూ వేరే రాష్ట్రానికి వివేకా కేసు విచారణను తరలించాలని కూడా పిటీషన్లో సునీతా కోరారు. సునీతారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐని ప్రతివాదులుగా చేర్చిన నేపథ్యంలో ఆమె పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.
సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఆసక్తికరమైన పోస్టులను పెట్టింది. రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం అంటూ కామెంట్ చేసిన టీడీపీ అన్న పాలనలో నిజం బయటకు రాదా? అని ప్రశ్నించింది.