డోలో-650 తయారీదారులు ఈ ట్యాబ్లెట్‌ను ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు రూ.1,000 కోట్ల విలువైన బహుమానాలు (తాయిలాలు) ఇచ్చినట్లు మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉచితాలు తీసుకుని ప్రజలకు మందులు రాసిచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరమన్న మెడికల్ అసోసియేషన్.. వైద్యులకు ఉచితాలు అందించకుండా నిరోధించే చట్టమేదీ ప్రస్తుతానికి లేదని కోర్టుకు తెలిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. కరోనా సమయంలో 650 ఎంజీ టాబ్లెట్ అమ్మకాల కోసం డోలో కంపెనీ రూ. 1,000 కోట్లకు పైగా ఉచితాలను ఇచ్చిందని ఆరోపించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నుంచి వచ్చిన నివేదిక తను ఆరోపిస్తున్న సమాచారానికి మూలమని ఆయన పేర్కొన్నారు.అలాగే, యాంటీబయాటిక్‌ల అవసరం లేకపోయినా వివిధ కాంబినేషన్లతో ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాబట్టి డ్రగ్ ఫార్ములేషన్లను నియంత్రించేందుకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ అవసరమని కోర్టుకు తెలిపారు.జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ డివై చంద్రచూడ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
డోలో 650 అమ్మకాల అంశంలో ఫార్మా కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చెప్పేది నా చెవులకు వినసొంపుగా లేదు. నాకు కరోనా సోకిన సమయంలో కూడా సరిగ్గా ఇదే వాడాలని చెప్పారు’ అని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈ విషయంపై వారం రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. 10 రోజుల తర్వాత ఈ అంశాన్ని మళ్లీ విచారిస్తామని తెలిపారు.
ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన ట్యాబ్లెట్లలో డోలో ఒకటి.. కొంచెం జ్వరం వచ్చినా, కాస్త తల నొప్పి కలిగినా, ఒళ్లు నొప్పిగా ఉన్నా గుర్తొచ్చే ఏకైక ట్యాబ్లెట్ డోలో 650. ఒకప్పటి పారాసిటమల్ డోసు పెంచి డోలో 650 గా వచ్చిన ఈ టాబ్లెట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే కరోనా కాలంలో ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ఎలాంటి లక్షణాలు కనిపించినా డోలో 650 వేసుకోవడం అలవాటుగా మారిపోయింది.
ప్రతి ఇంట్లో ఏం ఉన్నా లేకున్నా డోలో మాత్రం తప్పక ఉంటుంది. దానితో దీనికి గిరాకీ అనూహ్యంగా పెరింగింది. డోలో-650 ట్యాబ్లెట్లను మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ తయారు చేస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో ఈ సంస్థ ఏకంగా 350 కోట్ల ట్యాబ్లెట్లను విక్రయించింది. ఒకే ఏడాది ఏకంగా రూ. 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా, గతంలో మైక్రోల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లో, మైక్రోల్యాబ్స్ కార్యాలయంలోజరిగిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి.