కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ హస్తం పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో పేర్కొంటూ పార్టీ ప్రస్తుత దుస్థితికి రాహుల్ గాంధీ `అపరిపక్వ నాయకత్వమే’ కారణం అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో మార్పులను సూచించేందుకు గతంలో నిర్వహించిన మేధోమథనంలోని అంశాలు అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆగస్టు 16న జమ్ము కాశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధిపతి పదవికి ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం జరిగింది.
పార్టీలో సీనియర్ నాయకులను, అనుభవం గలవారిని పక్కన పెట్టి, భజనపరులతో ఏఐసీసీ నిండిపోయినదని మండిపడ్డారు. పార్టీలో సంప్రదింపుల పక్రియ నిలిచిపోయినదని వాపోయారు. కాంగ్రెస్ తో అర్ధశతాబ్ద కాలంగా సంబంధాలున్న ఆజాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా, ఇందిరా గాంధీ నుండి ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పలు పదవులు చేపట్టారు.
సుదీర్ఘకాలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు నమ్మకస్తుడిగా పేరొంది దాదాపు ప్రతి రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణాల బాధ్యతలను ఏదో ఒక సమయంలో చేపట్టారు. అయితే రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత పార్టీలో ప్రాధాన్యత కొల్పుతూ ఉండడం, రాజ్యసభ సభ్యత్వం ముగిసినా తిరిగి నామినేట్ చేయక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకు అవసరం అని, జవాబుదారీతనం కావాలని కోరుతూ సీనియర్ నాయకులు జి-23గా ఏర్పడిన బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, ఒక్కటి కూడా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదని, కాంగ్రెస్ రాజకీయ పలుకుబడి క్షీణించడం.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో పేలవమైన పనితీరుకు రాహుల్ గాంధీ అపరిపక్వతే కారణమని ఆరోపించారు.
రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం, సీనియర్లు అందరిని రాహుల్ పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా లేనప్పటికీ అన్నింటిలో రాహుల్ జోక్యం పెరిగిందన్నారు. అనుభవం లేని కొత్త కోటరీ పార్టీ వ్యవహారాలను నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రాహుల్‌ను నిందిస్తూనే సోనియాగాంధీని ప్రశంసించారు.
దురదృష్టవశాత్తూ రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత మొత్తం యంత్రాంగాన్ని ఆయన కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా విషయాల్లో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని ఆజాద్ స్పష్టం చేశారు.