నందమూరి బాలకృష్ణ నటించిన వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, అలాగే అనుష్క కీలక పాత్ర పోషించిన రుద్రమదేవి కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు, గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాల నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు పన్ను రాయితీ తీసుకుని టికెట్ రేట్లు తగ్గించలేదని సినిమా ప్రేక్షకుల వినియోగదారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పన్ను రాయితీ పొందిన మేర డబ్బును ప్రభుత్వాల నుంచి తిరిగి రాబట్టాలని ఆ పిటిషన్ లో కోరారు.
రుద్రమదేవికి తెలంగాణలో రాయితీ ఇవ్వగా, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాయితీ ఇచ్చారని పిటిషన్ లో వెల్లడించారు. కానీ ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు.
ఈ పిటిషన్ ను డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం, బాలకృష్ణకు, ఆయా చిత్రాల నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది. తమ నోటీసులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.
బాలకృష్ణ వందో సినిమా కావడంతో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ బడ్జెట్ తో జనవరి 12, 2017లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజైంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలయ్య సరసన శ్రియా హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని కీలక పాత్రలో నటించారు. 79 రోజుల్లోనే డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడం అప్పట్లో హాట్ టాపిక్.
అనుష్క కీలక పాత్ర పోషించిన ‘రుద్రమదేవి’ చిత్రానికి గుణశేఖర్ దర్శకనిర్మాత. 2015 అక్టోబర్ 9న ఈ చిత్రం విడుదలైంది.ఈ రెండూ చారిత్రాత్మక చిత్రాలు కావడంతో ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.