ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తన వెంట నడిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అధికారంలో ఉంది వ్యవహరిస్తున్న తీరుపట్ల ప్రముఖ గాంధేయవాది, సామజిక ఉద్యమకారుడు అన్నాహజారే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయనకు పరుషమైన పదజాలంతో ఓ లేఖను వ్రాస్తూ “మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది” అంటూ తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటూ ఉండడం పట్ల కేజ్రీవాల్‌పై అన్నా హజారే ఓ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి” అని గుర్తు చేశారు.
ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో హజారే మండిపడ్డారు. తన స్వస్థలం రాలేగావున్లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“నువ్వు, మనీశ్ సిసోడియా, అంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది” అని ఆయన లేఖలో మండిపడ్డారు. “నేను సూచించినట్లుగా.. మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో” అంటూ ఆప్ ఓ రాజకీయ పార్టీగా ఏర్పడటమే పెద్ద తప్పిదమని స్పష్టం చేశారు.
అయినా బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్ అని కేజ్రీవాల్ ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆయన తీవ్ర్త్ఆ గ్రహం వెల్లగక్కారు.
‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్” అని తన లేఖలో గుర్తు చేశారు.
“నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్?..” అంటూ కేజ్రీవాల్ ను హజారే నిలదీశారు.