దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుకు సంబంధించి ఆమె సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళతో పాటు అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ భాస్కర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, జయలలిత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్లను విచారణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎం కె స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని ప్రశ్నించేందుకు ప్రత్యేక సిట్ మరికొద్ది రోజుల్లో రంగంలోకి దిగనుంది.
ఇందుకు తగ్గ చట్టపరమైన అంశాలపై న్యాయ నిపుణులతో అధికార వర్గాలు చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. జయలలిత 2016 డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సందర్భంగా పలు వివాదాలు చెలరేగడం, పలు అనుమానాలు వ్యక్తం కావడం తెలిసిందే. ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు, ఆరోపణలు రావడంతో గత ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను నియమించింది.
ఈ కమిషన్ రెండు, మూడు రోజుల క్రితమే సీఎం స్టాలిన్‌కు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోనే వీరిపై తదుపరి దర్యాప్తు జరపాలని సిఫార్సు చేశారు. ప్రభుత్వ వర్గాలు సమగ్రంగా పరిశీలించాయి. ఇందులో ఆర్ముగ స్వామి సూచించిన అంశాలు, కొన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారు.
ఆర్ముగ స్వామి తన నివేదికలోని కీలక విషయాల గురించి సోమవారం సాయంత్రం పొద్దు పోయే వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్టాలిన్ సుదీర్ఘంగా చర్చించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో చేరిన రోజు నుంచి మరణించే వరకు జరిగిన పరిణామాలు, వైద్య సేవలు అంశాలను నివేదికలో ఆర్ముగ స్వామి పొందుపరిచారు.
ఈ మేరకు జయలలిత నెచ్చెలి శశికళ, డాక్టర్ శివకుమార్, అప్పటి ఆరోగ్య మంత్రి విజయభాస్కర్, అప్పటి సీఎస్ రామమోహ్మన్ రావును విచారించాలని సలహా ఇవ్వడం మంత్రి వర్గం దృష్టికి వచ్చింది. దీంతో ప్రత్యేక సిట్ ద్వారా విచారణ జరిపేందుకు మంత్రి వర్గం నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ మేరకు మరికొద్ది రోజుల్లో ప్రత్యేక పోలీసు అధికారి పర్యవేక్షణలో ఈ సిట్ రంగంలోకి దిగనుంది. న్యాయ నిపుణులతో ఇందుకు తగ్గ చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. సిట్ నివేదిక సమర్పించిన అనంతరం ఆ నివేదికతో పాటు ఆర్ముగ స్వామి కమిషన్ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ విచారణ సంకేతాల నేపథ్యంలో అమ్మ మరణం మిస్టరీ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
మంత్రి వర్గంలో గత ప్రభుత్వ హయాంలో తూత్తుకుడిలో జరిగిన కాల్పుల వ్యవహారంపై కూడా సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా, ఆ నివేదిక ఆధారంగా శాఖ పరమైన చర్యలకు డీఎంకే పాలకులు సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్, రెవెన్యూ అధికారులు 21 మంది చర్యలకు అరుణా జగదీశన్ కమిషన్ తన నివేదికలో సిఫార్సు చేయడం గమనార్హం.
స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా బయలుదేరిన ఉద్యమం, ర్యాలీ, కాల్పులు ఆ తదుపరి పరిణామాల గురించి అరుణా జగదీశన్ తన నివేదికలో వివరించారు. ఐపీఎస్ అధికారులతో పాటూ 17 మంది పోలీసుల అధికారులు, కలెక్టర్, నలుగురు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సూచించడం గమనార్హం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.