బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌పై వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో అధికారం బీజేపీదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజారిటీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, టీఆర్ఎస్ భవిష్యత్తు లేదని నేతలే చెప్తున్నారని తెలిపారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ద ప్రెస్’కార్యక్రమంలో పాల్గొంటూ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఒక చిత్తు కాగితంగా మారిందని, దులోని అంశాలేవి ఆచరణకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవరూ సంతోషంగా లేరని, ఆ పార్టీలో తమకు భవిష్యత్ లేదని చాలా మంది భావిస్తున్నారని చెప్పారు.
” మంత్రిగా నేను ప్రగతిభవన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు లేకుండానే విధాన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా అవకాశమివ్వలేదు. చాలా సందర్భాల్లో నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఎన్నో రూపాల్లో అవమానించారు” అంటూ పేర్కొన్నారు.
“కేబినెట్ మంత్రిగా కాదు… కనీసం మనిషిగా గుర్తించలేదు. నాకే కాదు గతంలో నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, తదితరులకు కూడా ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. తన ముని మనమడు వరకు అధికారంలో ఉండాలంటే తెలంగాణ చైతన్యాన్ని చంపేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు” అంటూ దుయ్యబట్టారు.
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇంకా ఎవరితోనూ బీజేపీలో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. అందరం కలిసి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం అని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
తనలాంటివారికి, వందల ఎకరాలున్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు, ఇతర అంశాలపై ముందుచూపు లేకుండా, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. తర్వాత సమర్థించిన చరిత్ర కేసీఆర్‌దని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపిచ్చారు.
వ్యక్తిగత అవసరాల కోసం లొంగిపోవద్దని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఓట్ల కోసమే కేసీఆర్ దళితబంధు తీసుకొచ్చాడన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను బిజెపిని వదిలి కాంగ్రెస్ లోకి వెళ్తానని సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు. పార్టీలు మారే సంస్కృతి తనది కాదని స్పష్టం చేస్తూ టీఆర్ఎస్ నుంచి తాను బయటకు రాలేదని, వాళ్లే పంపించేశారని గుర్తు చేశారు. అన్నీ ఆలోచించుకున్న తరువాతే బీజేపీలో చేరానని వెల్లడించారు.
పేదలపై నిజమైన ప్రేమ ఉంటే దళితబంధు ఇప్పటికీ ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నించారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు. సంబంధిత మంత్రులు లేకుండా శాఖలపై రివ్యూ చేసిన నీచ చరిత్ర సీఎం కేసీఆర్‌దని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.