కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని దీంతో అడ్డగోలుగా అవినీతి జరిగిందనికేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ప్రాజెక్టు అంచనా రూ. 38 వేల 500 కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆమె గుర్తు చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్లో భాగంగా జిల్లాలో 3 రోజుల పర్యటనను ఆమె గురువారం కామారెడ్డి నుండి ప్రారంభిస్తూ
కాళేశ్వరం సహా మిడ్మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డి, కిష్టంపల్లి, నక్కలగూడెం వంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం చెల్లించలేదని ఆమె ప్రశ్నించారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, దాన్ని రూ.లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెంచిందో సమాధానం ఇవ్వాలి. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతుంది. అయితే కాళేశ్వరం త్వరగా పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి త్వరగా పూర్తయినపుడు నిర్మాణ వ్యయం మూడింతలు ఎందుకు పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలి..’అని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు.
తెలంగాణలో అప్పుడే పుట్టిన బాబుకు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ” నేను తెలంగాణ ప్రజలకు కోసం నమస్కరిస్తున్న. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి తెలంగాణలో అమల్లోకి రావాలి. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేనే ప్రధానమంత్రిని అని కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారు. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు” అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
ఉపాధి హామీ పథకం కోసం కేంద్రం రూ. 20 వేల కోట్లు ఇచ్చినదని చెబుతూ ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారని, తాము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని కేంద్ర ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.
“దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి” అంటూ ఆమె కేసీఆర్ ను నిలదీశారు. లిక్కర్ స్కాంపై ఎవరి ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతుందని ఆమె ధ్వజమెత్తారు.
పీఎం అవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చే ఇండ్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంగా మార్చారని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. రాష్ట్ర రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ పథకం ద్వారా రైతులకు పంటలు ఎలా నష్టపోయినా పరిహారం కేంద్రం అందిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెలు, చేపల పెంపకానికి కూడా కేంద్రం ఇస్తున్న నిధులే రాష్ట్ర ప్రభుత్వం వాడుతోందని ఆమె చెప్పారు. సీఎం కేసీఆర్ తీరుతో రాష్ట్రంలో ఇవాళ రైతులు అప్పుల పాలయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 91.7 శాతం మంది రైతులు అప్పుల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని అంటూ రైతు రుణమాఫీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు.