అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం రోజుకొక మలుపు తీసుకొంటున్నది. ప్రస్తుతంకు అన్నాడీఎంకే నాయకత్వం పళనిస్వామికే దక్కింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఆమోదం తెలిపింది.
జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేయడంతో ప్రధాన కార్యదర్శిగా పళని ఎన్నికకు తెలిపినట్లు అయింది. అయితే, ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు.
జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించి, సర్వసభ్య సమావేశానికి స్టే విధించింది.
జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్‌ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు.
అయితే, సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ విచారించి ఆ స్టేను రద్దు చేశారు. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.
ఇలా ఉండగా, కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్‌లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా ఇంకా విచారణలో కొనసాగుతున్నది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్‌లో వాదనలు జరగాల్సి ఉంది.