రాజకీయ పార్టీలు తమ పేరు, గుర్తులలో మతంను వాడుకొంటే అటువంటి రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమీషన్ ను ఆదేశింపమని దాఖలైన పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై అభిప్రాయం తెలియజేయాలంటూ భారత ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 కింద మతాన్ని వాడుకుంటూ ఓటర్లను ఆకర్షించడంపై కఠిన నిషేధం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. సైయద్ వసీస్ రిజ్వి అనే వ్యక్తి తన న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా ఈ పిటిషన్ వేశారు.
రాజ్యాంగం, రాజ్యాంగ విలువల పరిరక్షణలో భాగం ఆర్పీఏ అని పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ గౌరవ్ భాటియా న్యాయమూర్తులు ఎం.ఆర్ షా, కృష్ణ మురారితో కూడిన డివిజన్ బెంచ్ ముందు తన వాదన వినిపించారు..
రెండు రాష్ట్ర పార్టీలను భాటియా ఉదహరిస్తూ, ఆ రెండు పార్టీలు తమ పేరులో ముస్లిం అనే పదం వాడుతున్నాయని, కొన్ని పార్టీల జెండాల్లో నెలవంక, నక్షత్రం గుర్తులు ఉన్నాయని తెలిపారు. ఆ విధంగా పార్టీ పేరులో మతం గుర్తులు చొప్పించవచ్చా? అని ప్రశ్నించారు.
ఉదాహరణకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కు లోక్సభ, రాజ్యసభలో ఎంపీలు, కేరళలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ”ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కాదా? రాజకీయాలను కలుషితం చేయవచ్చా? దీనిపై దృష్టి సారించాల్సి ఉంది” అని ఆయన తన వాదన వినిపించారు.
సెక్యులరిజం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రమని ఎస్ఆర్ బొమ్మై వెర్సన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ భాటియా ప్రస్తావించారు. మతం పేరుతో ఓట్లు అడగడం ఆర్ఏపీ, లౌకకవాదం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు.
”ప్రజలు ఓటు వేసేటప్పుడు ఏ అంశాన్నైనా పరిగణలోనికి తీసుకోవచ్చు. కానీ మత ప్రస్తావనకు తావులేదు. మతపరమైన గుర్తు లేదా పేరుతో ఒక అభ్యర్థి ఎన్నికైతే, ఆర్పీఏ చట్టం సెక్షన్ 123లోని సబ్-క్లాస్ (3)కు కాలం చెల్లినట్టే” అని భాటియా పేర్కొన్నారు. ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం దీనిపై అక్టోబర్ 18వ తేదీలోగా తన అభిప్రాయం తెలియజేయాలని ఈసీఐకి నోటీసులు ఇచ్చింది. సంబంధిత రాజకీయల పార్టీలను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.