నేటి విద్యార్థులపైనే 2047 నాటి భారతదేశ స్థాయి, భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీరు. తదనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును నేటి ఉపాధ్యాయులు రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. “ఆ విధంగా మీరు విద్యార్థుల జీవితాలను ఉజ్వలం చేయడంతోపాటు దేశ భవితకు ఒక రూపాన్నివ్వడంలో మీ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు” అని ప్రధానమంత్రి కొనియాడారు.
ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషిస్తూ విద్యార్థి కలలతో ఉపాధ్యాయుడికి అనుబంధం ఏర్పడినప్పుడు, వారినుంచి గౌరవాదరణలు పొందడంలో విజయవంతం కాగలడని చెప్పారు.
విద్యార్థులు ముందంజ వేసేదిశగా వారితో కలసి అవిశ్రాంతంగా పనిచేయగల సానుకూల దృక్పథమే వారి విశిష్ట లక్షణమని పేర్కొన్నారు. “ఒక వ్యక్తికి వెలుగుబాట చూపడం ఉపాధ్యాయుని కర్తవ్యం.. అలాగే విద్యార్థుల కలలకు రూపమిచ్చి వాటిని సంకల్పంగా మార్చుకోవడం నేర్పేదీ వారే” అని ఆయన తెలిపారు.
వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థుల జీవితంలోని సంఘర్షణలు-వైరుధ్యాలను తొలగించాల్సిన ప్రాముఖ్యం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. పాఠశాలలో, సమాజంలో, ఇంట్లో విద్యార్థి అనుభవంలోకి వచ్చే అంశాల నడుమ ఎలాంటి సంఘర్షణకూ తావుండరాదన్నది అత్యంత ప్రధానాంశమని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు, విద్యారంగ భాగస్వాములు విద్యార్థుల కుటుంబాలతో మమేకమయ్యే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థినీ సమానంగా చూడాలని, కొందరిపై ఇష్టం.. మరికొందరిపై అయిష్టం చూపరాదని హితవు పలికారు.
భగవద్గీతను పదేపదే చదివిన మహాత్మాగాంధీ ప్రతిసారి ఓ కొత్త భాష్యాన్ని కనుగొన్నారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వ పత్రం విద్యార్థుల జీవితాలకు ప్రాతిపదిక కాగలిగేలా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ఈ విధానాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషించారు” అని ఆయన వెల్లడించారు. అందుకే జాతీయ విద్యా విధానం అమలులో వారి పాత్ర ఎంతో కీలకమని ప్రకటించారు.
స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో తానిచ్చిన సందేశంలో భాగంగా ‘పంచ్ప్రాణ్’ పేరిట చేసిన ప్రకటనను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ‘పంచ ప్రాణాల’ గురించి పాఠశాలల్లో క్రమం తప్పకుండా చర్చించవచ్చని, తద్వారా వాటి స్ఫూర్తిని విద్యార్థులకు స్పష్టంగా తెలపాలని సూచించారు.
ఈ సంకల్పాలు దేశ ప్రగతికి ఒక మార్గంగా ప్రశంసించబడుతున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు వాటిని పిల్లలకు, విద్యార్థులకు తెలియజేసేందుకు మనం ఒక మార్గం అన్వేషించాల్సి ఉందని ఆయన అన్నారు. “దేశంలో ఏ మూలనైనా 2047 గురించి కలలు కనని విద్యార్థి ఉండరాదు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్, సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి కూడా పాల్గొన్నారు.