తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. తాను స్పీకర్ పై చేసిన వాఖ్యలసాకుతో తనపై అనర్హత అస్త్రం ప్రయోగించే ప్రయత్నం గురించి ప్రస్తావించగా ఇప్పటివరకు తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు ఇస్తే ఇవ్వోచ్చేమో అని చెప్పారు.
మంగళవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జరిపిన బిఎసి సమావేశంపై తమలో ఎవ్వరిని ఆహ్వానించక పోవడంపై బిజెపి ఎమ్యెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పర్యాయం కూడా బిజెపి ఎమ్యెల్యేలను ఆహ్వానించక పోవడమే కాకుండా, ముగ్గురిని కూడా మొదటి రోజునే సమావేశాల చివరి వరకు సభ నుండి బహిష్కరించారు.
స్పీకర్ ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు.సీఎం చెప్పింది చేయడం తప్పా.. స్పీకర్ పోచారానికి వేరే పని లేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మేల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని చెబుతూ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు.
ఉమ్మడి ఏపీలో 80, 90 రోజులు సమావేశాలు జరిగేవని, బడ్జెట్ సమావేశాలు 40 నుంచి 45 రోజులు కొనసాగేవని ఈటెల గుర్తు చేశారు. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి అకారణంగా, అన్యాయంగా సస్పెండ్ చేశారని దయ్యబట్టారు. ప్రజల సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీ కేవలం 5 నిమిషాలే సాగిందని చెబుతూ ఇక్కడ సీఏం తప్పించుకోవచ్చు గానీ, ప్రజల చేతిలో ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడుతామని, లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి స్పీకర్ పిలవలేదని మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని, ఇవాళ బీజేపీకి ముగ్గురు సభ్యులున్నప్పుడు ఎందుకు పిలవడంలేదని ఆయన ప్రశ్నించారు.
ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని, అంతమందిని ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే తెచ్చుకుంటామని రఘునందన్ రావు సవాల్ చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వివరించామని, అయినా తమని బీఏసీ సమావేశానికి పిలవలేదని తెలిపారు. సీఎం చెప్పినట్లుగా స్పికర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు.సంతోష్ రెడ్డి విమర్శలు
మరోవైపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషి అంటూ బీజేపీ సభ్యుడు ఈటల రాజేందర్ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ్యునిగా తనకు 20 యేండ్ల సీనియారిటీ ఉందని మాట్లాడుతున్న ఈటల.. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరస్తూ మాట్లాడడం తీవ్ర విచారకరం అన్నారు.
తన సీనియారిటీలో నేర్చుకున్నది ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ తన బాధ్యతలను నిబంధనల మేరకు చక్కగా నిర్వహిస్తున్నారని, సభ్యుల సంఖ్యను బట్టి బీ ఏ సి లో పార్టీలకు అవకాశం ఇవ్వాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నపుడు కూడా బీజేపీకి బీఏసీ లో అవకాశం లేదనే విషయం తెలుసుకోవాలన్నారు. ఈటలతో మాకు నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.