ప్రముఖ నటుడు కృష్ణంరాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు.
వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా చేసిన కృష్ణంరాజు తెలుగు చిత్రసీమలో రెబెల్ స్టార్‌గా పేరొందారు. కృష్ణంరాజుకు భార్య (శ్యామలాదేవి), ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రముఖ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పెదనాన్న కూడా. కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్ లో జరగనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు అసుపత్రిలో చేరారు. అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ రెండు సార్లు పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన బాధ పడినట్లు సమాచారం. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఆయన ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు.
కొన్ని దశాబ్దాల పాటు తెలగు సినీ ఇండస్ట్రీని ఏలిన కృష్ణంరాజు 1966లో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. చిలకా గోరింక చిత్రంతో అరంగేట్రం చేసి,చివరిసారిగా రాధేశ్యామ్ మూవీలో నటించారు. అవే కళ్లు మూవీతో విలన్ గా నిరూపించుకున్నారు. మొత్తం 187 చిత్రాలకు పైగా నటించిన కృష్ణంరాజు నిర్మాతగా గోపీకృష్ణ మూవీస్ స్థాపించారు.
అమర దీపం సినిమాకు 1977లో బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. 1984లో బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో ఉత్తమ నటుడిగా నంది అవార్డ్. 1986లో తాండ్రపాపారాయుడుకు ఫిల్మ్ ఫేర్ అవార్డు. 2006లో దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం లభించాయి.
ఐదున్నర దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు అన్ని రకాల పాత్రల్లోనూ మెప్పించారు. బుద్దిమంతుడు, మనుషులు మారాలి,పెళ్లి కూతురు, మహమ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, నీతి నియమాలు, తల్లీ కొడుకులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు లాంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి.
సాంఘీక, పౌరాణిక చిత్రాలతో పాటు జానపద కథల్లోనూ నటించిన కృష్ణంరాజు నటించారు. ముఖ్యంగా భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు సినిమాలతో ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. తన అన్న కొడుకు ప్రభాస్ తో బిల్లా, రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించారు.
1991లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీలో చేరి నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లో బీజేపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999లో నరసాపురం నుండి గెలుపొందారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి, రాజమండ్రి నుండి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత తిరిగి బీజేపీలో చేరారు.
కృష్ణంరాజు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎంలు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని పేర్కొన్నారు.
దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నారని కొనియాడారు.
కృష్ణంరాజు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, నటులు నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, నిఖిల్ సిద్దార్థ, శర్వానంద్ తో పాటు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.