హర్యానా బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగాట్ (42) మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ షిపార్సు మేరకు కేంద్ర హోంశాఖ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోగాట్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.
గోవా పర్యటనకు వెళ్లిన నటి సోనాలి ఫోగాట్ ఆగస్టు నెలలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె మొదట గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఫొటాట్ శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. సోనాలి ఫోగాట్ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఫోగాట్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పనాజీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ హర్యానా ప్రజలతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేస్తామని చెప్పారు.
గోవా సీఎం సూచన మేరకు కొన్ని గంటల్లోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సోనాలి శరీరంపై అనేక చోట్ల గాయపు మరకలు ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఆమె మృతిపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండు చేశారు.
సోనాలి వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సంగ్వాన్ గతంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని సోనాలి తన తల్లికి కూడా ఫిర్యాదు చేసిందని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.