పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడటంతో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మెల్లగా పావులు కదుపుతున్నాయి. తాజాగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతాపార్టీకి మధ్య పొత్తు కుదిరింది.
ఈ విషయాన్ని కేంద్రమంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి గజేంద్రసింగ్ షెకావత్ అధికారికంగా ప్రకటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసే విషయమై అమరీందర్‌సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి, తమకు మధ్య ఏడు దఫాలుగా చర్చలు జరిగాయని తెలిపారు.
రానున్న శాసన సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు పంజాబ్ బీజేపీ ఇన్‌ఛార్జి గజేంద్ర సింగ్ షెఖావత్, కెప్టెన్ సింగ్ ధ్రువీకరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటాం అని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమ కూటమి ఎన్నికల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని కెప్టెన్ అమరీందర్ సింగ్ భరోసా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కెప్టెన్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు.
అమరీందర్ సింగ్ ఇచ్చిన ట్వీట్లో, తాను షెఖావత్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యానని తెలిపారు. 2022లో జరిగే పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం తాము బీజేపీతో సీట్ల సర్దుబాటు కోసం అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని వెల్లడించారు. గెలుపే ప్రధాన లక్ష్యంగా ఈ పంపకాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని 101 శాతం నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.