ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిందని బిజెపి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు.
కేవలం అధికార, ప్రతిపక్షాల మధ్య బూతుల పోటీలు మాత్రమే జరుగుతున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు, ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి గతంలోనే స్పష్టం చేశామని, ఆనాడు అన్ని పక్షాలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నది తమ విధానమని తేల్చి చెప్పారు.
అమరావతిని అభివృద్ధి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం కోసం భూమిని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయని, కొన్ని సంస్థలు చెల్లింపులు కూడా చేశాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంస్థకు కూడా కేటాయింపులు జరపలేదని ఆరోపించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుళ్లూరులో స్థలం కేటాయించాలని కోరితే ఇంతవరకు స్పందన లేదని మండిపడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలోనూ ఇదే తంతు అని చెప్పారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం ఏర్పాటు కోసం రూ. 22 కోట్లు చెల్లింపులు కూడా జరిపిందని, అయినా సరే స్థలాన్ని కేటాయించలేదని తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అంటున్న వైఎస్సార్సీపీ వాదనను ప్రస్తావిస్తూ రాజధానితో నిమిత్తం లేకుండా అభివృద్ధిని వికేంద్రీకరించవచ్చని తెలిపారు. రాజధాని కేంద్రీకృత అభివృద్ధి పాలనాపరమైన లోపమే తప్ప అభివృద్ధి చేయడానికి అడ్డంకులు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. హైదరాబాద్ విషయంలో నాటి పాలకులు తమ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధిని అక్కడికే పరిమితం చేశారని, ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.
అయితే ఇందుకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెలుపారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది బీజేపీ విధానపరమైన నిర్ణయమని, అయితే హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన దాన్ని న్యాయ రాజధాని అని పేర్కొనడం సరికాదని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరో నగరంలో ఉన్నాయని, అంతమాత్రాన అవి రాజధానులు కావని తెలిపారు.
రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయడం, నివేదికలివ్వడం జరిగిందని, కానీ ఆ నివేదికలు బయటకు మాత్రం రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. సిట్ నివేదికలో ఏముందో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా విఫలమైనందున అధికార పార్టీ వైఫల్యాలను తాము ఎండగడతామని జీవీఎల్ తెలిపారు.. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ గుర్తుచేస్తూ వాటిని ఎంతవరకు అమలు చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పోరుబాట మొదలుపెట్టి 5,000 సభలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
వైఎస్ఆర్సీపీకి నిజమైన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడుతుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని తప్పుదారిపట్టిన బలహీన ప్రతిపక్షంగా జీవీఎల్ అభివర్ణించారు. అలాంటి ప్రతిపక్షం కారణంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం జరగడం లేదని ధ్వజమెత్తారు.