ఏపిలో మూడు రాజధాను అంశాన్ని తేల్చివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలను ప్రశ్నించే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. అమరావతే రాజధాని ఉండాలంటూ హైకోర్టు తీర్పునివ్వడం శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ తీర్పుపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెహఫూజ్ నజ్కీ పిటిషన్ దాఖలు చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని పిటిషన్లో పేర్కొంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని తెలిపింది.
సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరించాలని, నెల రోజుల్లో అమరావతిలో అన్ని సదుపాయాలను కల్పించాలని హైకోర్టు ఆదేశించడం సరికాదని పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్ లో తెలిపింది.
రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పడం శాసనసభను అగౌరవపరచడమేనని చెప్పింది.
విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేసిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. మొత్తంగా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ఆరోపించింది. హైకోర్టు తీర్పునిచ్చిన కొన్ని నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.