గత కొన్నెండ్లుగా ఉగ్రవాదంతో, తుపాకీ కాల్పులతో మగ్గిపోతున్న కాశ్మీర్ లోయలో ఎట్టకేలకు సాధారణ పరిస్థితులు నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత అక్కడ సినిమా హాళ్లు తెరుచుకోవడమే కాకుండా, లోయలో మొట్టమొదటి సారిగా శ్రీనగర్‌లోని సోన్మార్గ్లో తొలి మల్టీప్లెక్స్సినిమా హాల్ ను స్వయంగా లెఫ్టునెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు.
కశ్మీర్లో మొదటి మల్టీప్లెక్స్‌లో మొత్తం 520 సీట్ల సామర్థ్యంతో మూడు సినిమా హాల్స్ ఉండగా.. స్థానిక వంటకాలను ప్రోత్సహించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేశారు. మల్టీపెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మనోజ్ సిన్హా దిగవంగత నటుడు షమ్మీ కపూర్‌కు నివాళులర్పించారు.
మల్టీపెక్స్‌లో అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా చిత్రం ప్రత్యేక ప్రదర్శనతో మల్టీపెక్స్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 నుంచి హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేద చిత్రం ప్రదర్శనతో రెగ్యులర్ షోలు ప్రారంభంకానున్నాయి.
వికాస్ ధర్ కంపెనీ టాక్సల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 2020లో కశ్మీర్లో మల్టీపెక్స్ నిర్మాణానికి దరఖాస్తు చేయగా, అదే ఏడాది జూన్‌లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కశ్మీర్లో కొద్దికాలంగా సినిమా హాళ్లు మూసివేయడంతో సినిమా థియేటర్ అంటే ఏంటి? మల్టీప్లెక్స్ అంటే తెలియని యువకులు సైతం ఎందరో ఉన్నారు.
సినిమా చూడాలంటే ఇప్పటివరకు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. లేదంటే టీవీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో చూడాల్సిన పరిస్థితి ఉండేది. చదువులు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మాత్రమే వెండితెరపై సినిమా చూసే అవకాశం కలిగింది.
1990లో ఉగ్రవాద సంస్థల బెదిరింపులు, దాడుల కారణంగా కాశ్మీర్‌లోని అన్ని సినిమా థియేటర్లను మూసివేశారు. తీవ్రవాద కాలంలో లోయలో 19 సినిమా హాళ్లు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. రీగల్, పల్లాడియం, ఖయామ్, ఫిర్దౌస్, షా, నాజ్, నీలం, షిరాజ్, బ్రాడ్వే థియేటర్లు మూతపడ్డాయి.
1999లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రీగల్, నీలం, బ్రాడ్వేలను తెరవడానికి ప్రయత్నించింది. అయితే, సెప్టెంబర్‌లో రీగల్ థియేటర్‌పై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. దాడి ఘటన అనంతరం రీగల్ థియేటర్‌ను మూసివేశారు.
భద్రత మధ్య పలు థియేటర్లను నడిపేందుకు ప్రయత్నించినా ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో అవి కూడా మాతపడ్డాయి. సైన్యం కృషితో అనంతనాగ్‌లో హెవెన్ సినిమా హౌస్ ప్రారంభించినా అది కూడా మూతపడింది.