కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్‌పై సావర్కర్ ఫొటో ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ప్రింటింగ్ పొరపాటుగా కాంగ్రెస్ పేర్కొంది. అనంతరం సావర్కర్ ఫొటో స్థానంలో గాంధీ ఫొటోను అంటించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘భారత్ జోడో’ పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర 15వ రోజుకు చేరింది. అయితే కేరళలోని ఎర్నాకులం జిల్లాకు ర్యాలీగా వెళ్లిన నేతలకు ఊహించని షాక్ ఎదురైంది. ‘భారత్ జోడో’ యాత్రకు సంబంధించిన పోస్టర్లో ముద్రించిన స్వాతంత్ర్య సమరయోధులలో కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ సిద్ధాంత కర్త సావర్కర్ ఫొటో కూడా ఉంది.
చెంగ్మనాడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ను ఎల్డీఎఫ్కు మద్దతుగా ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్మొదటగా గుర్తించారు. ఆ పోస్టర్‌తో కూడిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దానితో ఉలిక్కిపడిన కాంగ్రెస్ నేతలు జరిగిన ”పొరపాటును” వెంటనే గుర్తించి సావర్కర్ ఫోటో ఉన్న చోట గాంధీ ఫోటో తగిలించినట్టు ఆయన తెలిపారు.
కాగా, ఆలస్యం అయినప్పటికీ సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా కాంగ్రెస్ గుర్తించిందంటూ బీజేపీ పేర్కొంది. ఆలస్యంగానైనా సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడుగా రాహుల్ గాంధీ గ్రహించారని, చరిత్రను, నిజాన్ని ఎవరూ మరుగు పరచలేరని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ షెహజాద్ పూనావాలా ట్వీట్ చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రింటింగ్ పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు తెలిపింది. స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలు ముద్రించాలని ప్రింటర్‌కు చెప్పగా ఆన్లైన్లో వెతికి ఇలా ముద్రించారని పేర్కొంది. పొరపాటు గ్రహించిన వెంటనే స్థానిక కార్యకర్తలు ఆ ఫొటో స్థానంలో మహాత్మా గాంధీ ఫొటోను అంటించారని కేరళ కాంగ్రెస్ వెల్లడించింది.