తెలుగు వారికే గౌరవం తెచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఇంతలా అవమానిస్తే, తెలుగువారు అన్నవారు ఎవరు కూడా మన పార్టీకి (వైసీపీకి) ఓటు వేయరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. టిడిపిని అభిమానించని వారు కూడా, రాజకీయాలకతీతంగా ఎన్టీ రామారావు అభిమానిస్తారని ఆయన గుర్తు చేశారు.
“మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్ అభిమానే”నని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అయ్యిందేదో… అయ్యింది, ప్రజా నిర్ణయం మేరకు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించాలని ఆయన హితవు చెప్పారు. లేకపోతే 175 స్థానాలకు 175 స్థానాలలో ఓటమి చెందడం ఖాయమని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులను అప్పు పేరిట కొట్టివేసిన తమ ప్రభుత్వం, ఇప్పుడు ఆయన పేరును కూడా కొట్టివేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి శాసనసబాధిపతిగా ఉండగానే, స్పీకర్ సాక్షిగా… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతున్నామనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి, సభ ఆమోదించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణం విడ్డూరంగా ఉందని అంటూ ఒకవైపు ఎన్టీఆర్ అంటే తమకు ప్రేమానురాగము ఉన్నదని చెబుతూనే, మరొకవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కావడం వల్లే, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం అని కొట్టిపారవేసారు.
దేశంలో లక్షలాది మంది వైద్యులు ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి ఎంబిబిఎస్ చేసిన వైద్యుడు మాత్రమేనని, స్పెషలిస్ట్ కూడా కాదని, ఒక పల్లెటూరులో వైద్యం చేశారని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించని యూనివర్సిటీకి, మనము అప్పుగా డబ్బులు కొట్టేసిన యూనివర్సిటీకి, ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.
రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే, దానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కడప జిల్లాకు నవైయస్సార్ కడప జిల్లా అని నామకరణం చేశారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, జిల్లా పేరును మార్చలేదని తెలిపారు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత కడప పేరును కూడా మాయం చేసిన మహానుభావులం మనమని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో హైదరాబాద్ నగరంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ ఇండోర్ స్టేడియం అని పేర్లు పెట్టారని, మనలాగా సిగ్గు లేకుండా సొంత పేర్లు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. పేర్ల పిచ్చి పరాకాష్టకు చేరుకుందని , ఈ సంస్కృతిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా మార్జిన్ మన చెల్లించలేదని కేంద్ర మంత్రి భారతి పవర్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. ఏడు మెడికల్ కాలేజీల మంజూరి కోరితే, మూడు మెడికల్ కాలేజీలకు అనుమతిని ఇచ్చినట్లు భారతి పవర్ వెల్లడించారని పేర్కొన్నారు. అయితే ఆ మూడు మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులను చెల్లించలేదని ఆమె స్పష్టం చేసిందని తెలిపానారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రమే అనుమతినిచ్చిందని కేంద్ర మంత్రి భారతి పవర్ చెబుతుండగా, మిగిలిన 14 కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మచిలీపట్నంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి జగనన్న నూతన ప్రభుత్వ వైద్యశాల అని నామకరణం చేయడం పట్ల, భారతి పవర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చేసేది లేక దాని పేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ గా మార్చారని ఎద్దేవా చేశారు.