సోలర్ ప్లాంట్ల కోసం రూ.19,500 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చింది. అలాగే పిఎల్ఐ స్కీమ్ కిందకు సోలార్ ప్యానెళ్లను తెచ్చారు.
సెమీ కండక్టర్ల అభివృద్ధి, డిస్ప్లే తయారీ ఎకోసిస్టమ్ సంబంధి కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి ఆమోదం తెలిపింది. నూతన రవాణా విధానానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రవాణా సేవల సామర్థ్యం మెరుగుదల కోసం ఏకీకృత లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ఫారం, ప్రమాణీకం, పర్యవేక్షణ వ్యవస్థ, నైపుణ్యాభివృద్ధి అంశాలకు నూతన విధానంలో ప్రాధాన్యత ఉంటుందని కేంద్రం తెలిపింది.
2030 నాటికి టాప్ 25 దేశాల్లో చేరేలా లాజిస్టిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెరుగుపరుచుకునే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. వస్తువులు దేశవ్యాప్తంగా అంతరాయాలు లేకుండా రవాణా అయ్యే విధంగా చేయడం కోసం ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రాసెస్ రీ ఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది.
దేశం నలుమూలలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా వస్తువులు, ఉత్పత్తుల రవాణా జరగాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించారు. ప్రాసెస్ రీఇంజినీరింగ్, డిజిటైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లపై ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది. లాజిస్టిక్స్ కోసం జిడిపిలో దాదాపు 14 శాతం వరకు ఖర్చవుతుండటంతో దేశీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుంది.
లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ఈ ఖర్చు జిడిపిలో ఎనిమిది శాతం, తొమ్మిది శాతం మాత్రమే ఉంటోంది. లాజిస్టిక్ సెక్టర్లో 20కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు, 40 పార్టనర్ గవర్నమెంట్ ఏజెన్సీలు, 37 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్, 500 సర్టిఫికేషన్లు, 10,000కుపైగా కమోడిటీస్, 160 బిలియన్ డాలర్ల మార్కెట్ సైజ్ ఉన్నాయి.
దీనిలో 200 షిప్పింగ్ ఏజెన్సీలు, 36 లాజిస్టిక్స్ సర్వీసెస్, 129 ఇన్లాండ్ కంటెయినర్ డిపోలు, 166 కంటెయినర్ ఫ్రెయిట్ స్టేషన్స్, 50 ఐటి ఎకోసిస్టమ్స్, బ్యాంకులు, బీమా సంస్థలు ఉన్నాయి. దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, లాజిస్టిక్స్ సెక్టర్లో 22 మిలియన్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. పరోక్ష లాజిస్టిక్స్ ఖర్చులు 10 శాతం తగ్గే విధంగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ నూతన విధానం లక్ష్యం. దీనివల్ల ఎగుమతులు ఐదు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి తెలిపారు.