ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిషేధం నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీ, బ్యానర్ల ఉత్పత్తి, దిగుమతితోపాటు ముద్రణ, వినియోగం, రవాణ, ప్రదర్శనలపై కూడా నిషేధం ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు.. నిషేధం అమలుకు బాధ్యత వహించాలని ప్రభుత్వం పేర్కొన్నది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, పంచాయతీ అధికారులు, గ్రామ సచివాలయాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలు అమలులోకి రానున్నాయి. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించనున్నారు.
ప్లాస్టిక్ బ్యానర్లను గుర్తించి, తొలగించే అధికారాన్ని అధికారులకు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హులుగా పేర్కొన్నారు. ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్ అమలు, పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు చేపట్టనున్నారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీ, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వస్త్రాలను వినియోగించడం అలవాటు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.