దాదాపు రూ.3 వేల కోట్ల నిధుల కేటాయింపుతో రాజమహేంద్రవరం వద్ద ఎనిమిది ఫ్లైఓవర్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
జాతీయ రహదారి నంబర్ 216 పై మోరంపూడి, జొన్నాడ జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, తేతాలి, కైకవరం వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. అలాగే, వాకలపూడి-ఉప్పాడ-అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్, సామర్లకోట-అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్, రంపచోడవరం నుంచి కొయ్యూరి వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల విచారం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు.
‘అమెరికా ధనిక దేశం అవడం వల్ల అక్కడ రోడ్లు బాగుండడం కాదు.. అక్కడ రోడ్లు బాగుండడం వల్లే అమెరికా సంపన్న దేశమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ కెనడీ చెప్పిన ఓ సూక్తిని నేనెప్పుడూ చెబుతుంటా. ఆంధ్రలో కూడా మంచి రోడ్లు ఉంటే.. దేశంలోనే సంపన్న రాష్ట్రం అవుతుంది’ అని గడ్కరీ తెలిపారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే కాకినాడ పోర్టు ద్వారా ఖనిజాలు, జీవ ఇంధనం, గ్రానైట్ వంటివి సులభంగా రవాణా చేయొచ్చన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు, పెట్టుబడి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని.. నీరు, విద్యుత్, రవాణా లేకపోతే ఇండస్ట్రీలు రావని స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయని.. అవి లేకపోతే పేదరిక నిర్మూలన అసాధ్యమని స్పష్టం చేశారు.