మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని, ఆయన దుకాణం బంద్ ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని, ఎంఐఎతో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు.
నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా పెద్ద అంబర్ పేట సమీపంలోజరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ అక్టోబర్ 15 నుండి 5 విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నం గా మారుస్తామని వెల్లడించారు.
ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తుండని ధ్వజమెత్తారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం చేసాడని గుర్తు చేశారు. చేనేత కార్మికులను, గౌడ కులస్తులను, యాదవులు.. ఇలా అన్ని కులాలను నిర్వీర్యం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు.
పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నాడని, బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్, కేసులు పెడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సంక్షేమ పథకాలను ఆపదని హామీ ఇచ్చారు. అవి టీఆర్ఎస్ వైనా… కాంగ్రెస్ వైనా సరే… పేదలకు మరింత మంచి జరిగేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్మని చెప్పారుఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతోపాటు అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు.
ప్రజల సొమ్మును లూటీ చేసే వారు జైలుకు వెళ్ల్లాల్సిందేనని ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న పీఎంఏవై నిధులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుండడంతో రాష్ట్రంలోని పేదలకు పక్కా ఇళ్లు దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన నిధులను సైతం లబ్ధిదారులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటోందని ఆమె విమర్శించారు.
గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను లూటీ చేస్తోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. కేసీఆర్ పెద్ద మోసగాడని పేర్కొంటూ ఇలాంటి వారు అధికారంలో ఉండాలా? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్.. ఇంకెంత దోచుకుంటావ్? ఇంకెంత తింటావ్? ప్రభుత్వం ఉన్నది నీ కుటుంబం బాగు కోసమా? ప్రజల బాగు కోసమా? అని ఆమె నిలదీశారు.
ప్రజా ధనాన్ని లూటీ చేసిన వారి ఇళ్లకు బుల్డోజర్లు పంపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అది బీజేపీకే సాధ్యమని సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. టెర్రరిస్టులు, ఉగ్రవాదులకు ఇబ్బంది కలిగితే చాలు.. బాధపడే వ్యక్తి ఎవరో మీకు బాగా తెలుసు అంటూ ఒవైసీపై ఆమె పరోక్ష విమర్శలు చేశారు.
ఇక్కడ దేశాన్ని ముక్కలు చేసే నాయకుడు ఉన్నాడని, అతడు ఒవైసీకి సోదరుడు అవుతాడని కేసీఆర్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేసీఆర్ అని ఆమె ధ్వజమెత్తారు.