కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమవారం నూతన పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నెలరోజుల అనంతరం ఈ పరిణామం జరగడం గమనార్హం.
కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్ గత నెల 26న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ రాకతో పార్టీ పతనం ప్రారంభమైందంటూ అధిష్టానంపై మండిపడ్డారు. జమ్మూలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆజాద్ .. పార్టీ పేరుతో పాటు జెండాను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా పసుపు, తెలుపు, నీలం రంగుల్లో ఉన్న పార్టీ జెండాను ఆయన మీడియాకు విడుదల చేశారు.
”పసుపు సృజనాత్మకత, ఏకత్వానికి.. తెలుపు శాంతికి.. నీలం స్వేచ్చ, పరిమితుల్లేని పయనానికి ప్రతీక” అని ఆజాద్ పేర్కొన్నారు. తమ పార్టీ లౌకిక, ప్రజాస్వామ్యయుతంగా, ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా స్వతంత్రంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు.
తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని చెప్పారు. తమ పార్టీ పేరు కోసం 1500 పేర్లను పలువురు సూచించారని, ప్రజాస్వామిక, శాంతియుత, స్వతంత్రతలను ప్రతిబింబించే పేరు పెట్టాలని తాము కసరత్తు సాగించామని విలేకరులతో మాట్లాడుతూ ఆజాద్ వెల్లడించారు.
పార్టీ పేరును వెల్లడించే ముందు ఆదివారం ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తమ పార్టీ మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్‌కు పూర్తిస్ధాయి రాష్ట్ర హోదా సాధనపై దృష్టిసారించేందుకు సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని గతంలో జమ్ములో జరిగిన బహిరంగ సభలో ఆజాద్ పేర్కొన్నారు.