ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి అవన్నీ తన ఘనతగా చెప్పుకొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాగానే మూడేండ్లలో రాజధానిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజాపోరులో భాగంగా ఆయన గుంటూరు నగరంలోని లాడ్జ్ సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగీస్తూ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, లిక్కర్, రైస్, మైన్స్ మాఫియా రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. మద్యం అమ్మనివ్వనని కోతలు కోసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచి మద్యం ఏరులైపారేలా చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వమే బ్రాందీ తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. 50 రూపాయల విలువ చేసే మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముతూ దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. బటన్ నొక్కి జగనన్న డబ్బులిస్తున్నాడని అనుకుంటున్న జనం.. ఆ డబ్బంతా చెమటోడ్చి సంపాదించిన కార్మిక కర్షకులదని చెప్పారు.
జగన్‌లాంటి దోపిడీదారులను ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికే ఈ పోరుయాత్ర చేపట్టినట్లు వీర్రాజు వెల్లడించారు. మోదీ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూడు రాజధానుల పేరిట ప్రభుత్వం కాలాయాపన చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
మూడు రాజధానులు అంటూ చెప్తాడు, ఇక్కడే ఇళ్లు కట్టుకున్నా అంటాడు.. కానీ రాజధాని మాత్రం కట్టడు ఎందుకో? అని ప్రశ్నించారు. ఎక్కడో ఒకచోట రాజధాని కడుతున్నది మాత్రం కనిపించడం లేదని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే మూడేండ్లలోనే రాజధానిని నిర్మించి తీరుతామని హామీ ఇస్తున్నా అని చెప్పారు.