ప్రముఖ గాయని లతా మంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని అయోధ్యలో సరయు నది ఒడ్డున ఆ మహాగాయని పేరిట నిర్మించిన ఒక కూడలిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రారంభించారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో లతా మంగేష్కర్ చౌరహాను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సరయూ నది ఒడ్డున రూ. 7.9 కోట్ల అంచనా వ్యయంతో ఒక కూడలిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కూడలి వద్ద 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో 14 టన్నుల బరువైన ఒక వీణను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడంతోపాటు తన గాత్రం ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించిన లతా మంగేష్కర్ ను నిరంతరం స్మరించుకోవాలన్న సత్సంకల్పంతోనే అయోధ్యలో ఈ వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు. పాటలకు ప్రాణం పోయడం ద్వారా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న లతా మంగేష్కర్ స్ఫూర్తిని ఈ 40 అడుగుల వీణ ద్వారా యువ గాయకులు పొందేందుకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
లతా మంగేష్కర్ ను స్మరించుకునేందుకు ఈ చౌరస్తాకు ఆమె పేరు పెట్టామని, అదే విధంగా అయోధ్యలోని ప్రతి చౌరస్తాకు ఆధ్యాత్మిక వ్యక్తుల పేర్లు పెడతామని, రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వాములైన సాధుసంతుల పేర్లు పెడతామని ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్యలో అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి సరైన గౌరవం కల్పిస్తామని చెబుతూ మర్యాదా పురుషోత్తముడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్లాలని యోగి సూచించారు. జరుగుతున్న పురోగతికి ప్రతి అయోధ్యవాసి సహకరించాలని, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేకస్థానాన్ని నిలుపుకోనున్న అయోధ్య నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
పర్యాటకులు, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఈ కూడలిని తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీ వీణను ఇక్కడ ప్రతిష్టించామని అయోధ్య అభివృద్ధి సంస్థ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రాం సూతర్ ఈ వీణను రూపొందించారని, సరస్వతీ అమ్మవారి చిత్రం కూడా ఈ వీణపై ఉందని ఆయన తెలిపారు.
దేశంలోనే ఇంతటి భారీ సంగీత వాయిద్యాన్ని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ తెలిపారు. లతా మంగేష్కర్ దేశం గర్వించదగ్గ గాయకురాలని, ఆమె స్మారకార్థంగా చౌక్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం యోగి ఆదిత్యనాధ్ తెలిపారు.