మహిళలందరికీ చట్టపరంగా సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారం ‘ కూడా అబార్షన్ పరిధిలోనే ఉంటుందని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి.పార్దివాలా, జస్టిస్ ఎఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
బలవంతపు గర్భధారణ నుండి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ యాక్ట్ ప్రకారం.. అత్యాచారం నిర్వచనంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన వైవాహిక అత్యాచారంపై విచారణలకు మార్గం సుగమం చేసింది.
ఒక మహిళ వైవాహిక స్థితి ఆమె అబార్షన్ హక్కుని హరించడానికి కారణం కాకూడని, అవివాహిత మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అర్హులేనని పేర్కొంది. ఒంటరి లేదా అవివాహిత మహిళలను అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించకపోవడం ఆమె ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని తెలిపింది.
అబార్షన్ చట్టాల ప్రకారం వివాహిత, అవివాహిత మహిళల మధ్య వ్యత్యాసం కృత్రిమం, రాజ్యాంగం ప్రకారం నిలకడలేనిదని ధర్మాసనం పేర్కొంది. 25 ఏళ్ల అవివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ కీలక తీర్పుని వెలువరించింది. అవివాహితనైనందున చట్టప్రకారం అబార్షన్‌కు అర్హత లేదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది.
తాను గర్భం దాల్చి 23 వారాలైందని ఆ పిటిషన్లో పేర్కొంది. తన భాగస్వామి పెళ్లికి నిరాకరించాడని పేర్కొంది. తన తల్లిదండ్రులు రైతులని, ఇంటికి తానే పెద్ద కుమార్తెనని, తనకు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారని, ఇలాంటి సమయంలో బిడ్డను పోషించే స్థోమత తనకు లేదని పేర్కొంది.
గర్భంలోని పిండం ఆమెకు హానికలిగించదని మెడికల్ బోర్డు నిర్ధారించడంతో కోర్టు జులై 21న ఆ మహిళకు అబార్షన్‌కు అనుమతించింది. 2021లో సవరించిన అబార్షన్ చట్టంలోని నిబంధనలలో ఇప్పుడు ‘భర్త ’ అనే పదానికి బదులుగా ‘భాగస్వామి’ అనే పదాన్ని చేర్చినట్లు తెలిపింది.
అబార్షన్ పరిస్థితిని కేవలం వైవాహిక సంబంధానికి మాత్రమే పరిమితం చేయాలని పార్లమెంటు భావించడం లేదని వెల్లడించింది. అబార్షన్ హక్కుకు సంబంధించి వైవాహిక స్థితికి సంబంధిం తలెత్తిన ప్రశ్నను పరిష్కరించాలని కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 23న, అబార్షన్ చట్టం వివరణపై తన తీర్పును రిజర్వ్ చేసింది.