ఇకపై ప్రతి కారులో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. కార్ల వేరియంట్లు, ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి కారులో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్నా మిస్త్రీ చనిపోయారు. ఈ ప్రమాదంపై సమగ్ర అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోంది.
ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది.ఇకపై ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనను అమలులోకి తీసుకొస్తోంది. అక్టోబర్ 1 నుంచే ఈ నిబంధనను అమలులోకి తీసుకురానుంది.
ఎం-1 క్యాటగిరీలో కార్లలో ఇక నుంచి ఆరు ఎయిర్బ్యాగ్స్ ఉండాల్సిందే. ఎంత ఖరీదైన కార్లు అయినా లేక వేరియంట్లు అయినా ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అవరోధాలు ఉన్నాయని చెబుతూ వాటి ప్రభావం కూడా అధికంగా ఉందని పేర్కొన్నారు.