దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఆలయ చిన్నగోపురం వద్ద ముఖ్యమంత్రి తలకు పరివేష్టాన్ని అధికారులు చుట్టారు. తొలుత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మూలానక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. పంచెకట్టులో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను జగన్మోహన్రెడ్డి సమర్పించారు.
అనంతరం సరస్వతీదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మూల నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, లక్షలాది మంది యాత్రికులు దర్శనానికి రావడంతో అధికారులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుండే దర్శనానికి అవకాశం కల్పించారు.
పట్టువస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి వస్తే దర్శనాలను 15 నిమిషాల పాటు నిలిపివేస్తుంటారు. ఈసారి మాత్రం యాత్రికుల దర్శనం నిలిపేయకుండానే సిఎం దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం జగన్మోహన్రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు.
యాత్రికులతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. రాజీవ్‌గాంధీ పార్కు, పోలీసు కంట్రోలు రూము నుంచి ప్రకాశం బ్యారేజీ, భవానీపురంలోని స్వాతి థియేటర్, కుమ్మరిపాలెం సెంటరు వరకూ వాహనాలు బారులు తీరాయి. దర్శనానికి ఐదారు గంటల సమయం పట్టింది.
ఆలయం వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఉన్నారు.