త్వరలో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ లో రూ 3,650 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయదశమి పర్వదినం రోజున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గతంలో కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని ఈ పర్వత ప్రాంతం ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండడంతో డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ నేతలు శంకుస్థాపనలు మాత్రమే చేసేవారని, ఎన్నికల ముగిశాక ప్రాజెక్టులను మర్చిపోయేవారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఒక ఎయిమ్స్ హాస్పిటల్, ఒక ఇంజనీరింగ్ కాలేజీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు 2017లో శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. దేశ రక్షణలో ఎంతోమంది హీరోలను అందించిన రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎయిమ్స్ ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో కూడా హిమాచల్ ముఖ్యభూమిక పోషించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014లో హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, గత 8 సంవత్సరాల్లో మరో 8 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు ఆనందం, సౌలభ్యం, గౌరవం, రక్షణ, ఆరోగ్యాన్ని అందించే దిశగా డబల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాదులు వేసినట్లు చెప్పారు.
“అందరూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా ప్రభుత్వ ప్రాధాన్యం” అని ఆయన స్పష్టం చేశారు. తల్లులు, సోదరీమణుల సాధికారత కల్పన దిశగా ‘ఇంటింటికీ నీరు’ కార్యక్రమంసహా ప్రభుత్వం అమలు చేసిన మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత గ్యాస్ కనెక్షన్, శానిటరీ ప్యాడ్ పంపిణీ పథకం, మాతృ వందన యోజన వంటి పథకాల గురించి ఆయన వివరించారు.
కేంద్ర పథకాలను స్పూర్తిమంతంగా, వేగంగా అమలు చేయడమే కాకుండా వాటి పరిధిని విస్తరించడంపై ముఖ్యమంత్రిని, ఆయన బృందాన్ని ప్రధాని అభినందించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ నీరు, పెన్షన్ వంటి సామాజిక భద్రత పథకాల అమలులోనూ వేగం పుంజుకున్నదని కొనియాడారు.
అలాగే ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్ పథకంతో హిమాచల్‌లోని అనేక కుటుంబాలు ఎంతో ప్రయోజనం పొందాయని గుర్తుచేశారు. ఇక కరోనా టీకాల కార్యక్రమాన్ని వంద శాతం పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ఘనత సాధించిందని ఆయన ప్రశంసించారు.“హిమాచల్ ప్రదేశ్ అపార అవకాశాల గడ్డ” అని ప్రధానమంత్రి పేర్కొంటూ ఈ రాష్ట్రం విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నదని, సారవంతమైన భూమి ఈ రాష్ట్రం సొంతమని, అలాగే పర్యాటక ప్రాధాన్యం ఉన్నందున అపార అవకాశాలు అందివస్తాయని వివరించారు. అయితే, మెరుగైన అనుసంధానం లేకపోవడమే ఈ అవకాశాలకు అతి పెద్ద అవరోధంగా ఉన్నదని గుర్తుచేశారు.
“హిమాచల్ ప్రదేశ్‌లో గ్రామం నుంచి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సౌకర్యాల కల్పనకు 2014 నుంచి కృషి సాగుతోంది” అని ఆయన తెలిపారు. హిమాచల్‌లో అన్నివైపులా రోడ్ల విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని ప్రధాని సూచించారు. “ప్రస్తుతం హిమాచల్‌లో అనుసంధానం దిశగా దాదాపు రూ.50 వేల కోట్లతో పనులు చేస్తున్నారు” అని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.