సుదీర్ఘకాలం తరువాత కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న భారత జోడో యాత్రలో ఆమె గురువారం పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ, మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి 75 ఏళ్ల సోనియాగాంధీ కొన్ని కిలోమీటర్లు నడిచారు.
గురువారం ఉదయం కర్ణాటకలో మాండ్య జిల్లాలో జక్కనహల్లి, కరద్య మధ్య సోనియాగాంధీ పాద యాత్ర సాగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకార సోనియా పాదయాత్ర 30 నిమిషాల పాటు మాత్రమే జరగాల్సి ఉన్నా చివరికి రెండు గంటల పాటు జరిగిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో కలిసి నడచినవారిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు డికె శివకుమార్ తదితర నాయకులు ఉన్నారు. తమ అధ్యక్షురాలు యాత్రలో పాల్గనడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సహం మిన్నంటింది. ఉత్సాహం నిండిన స్వరాలతో బిగ్గరగా నినాదాలు చేశారు.
సోనియా, రాహుల్ గాంధీ కలిసి పాదయాత్ర చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మేం గతంలో తుఫానుల గుండా ప్రయాణించాం, సవాళ్లను అధిగమించాం. ఇప్పుడు కలిసి భారతదేశాన్ని ఏకం చేస్తాం’ అని రాహుల్ గాంధీ ఇంగ్లీష్, హిందీల్లో ట్వీట్ చేశారు. తన తల్లి చేతిలో చేయి వేసి కలిసి నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు.
కాంగ్రెస్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఇద్దరు కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేసింది. సోనియాగాంధీ షూ లేస్‌ను రాహుల్ కడుతున్న చిత్రాన్ని కూడా కాంగ్రెస్ పోస్టు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రెండు సార్లు కరోనా బారీన పడి కోలుకున్న తరువాత సోనియాగాంధీ బహిరంగ కార్యక్రమంలో కనిపించడం ఇదే మొదటిసారి. భారత జోడో యాత్ర కర్ణాటకలో మరో 15 రోజులు సాగుతుంది. తర్వాత తెలంగాణలో ప్రవేశిస్తుంది.